మసిపూసి..
రిమ్స్‌లో ‘లంచం ఇస్తేనే కొత్త పీఆర్సీ వ్యవహారం’
విచారణకు కమిటీ వేసేందుకు వెనకంజ
పెద్ద తలలే సూత్రధారులన్న అనుమానాలు..!
మౌఖికంగా విచారణ చేశాం, అవినీతి లేదు : రిమ్స్ డెరైక్టర్
రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం : రిమ్స్ సూపరింటెండెంట్
ఆదిలాబాద్ :రిమ్స్‌లో లంచం వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ఉన్నతాధికారులే శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పలువురు పెద్ద తలలే సూత్రధారులు కావడంతో వ్యవహారాన్ని మసిపూసి మారెడుకాయ అన్న చందంగా తమకు అనువుగా మలచుకుంటున్నారు. కొంత మంది హెడ్ నర్సులతో లంచం ఇవ్వలేదని చెప్పిస్తూ దీన్ని తేలికపరుస్తున్నారు. దీంట్లో పలువురు ఉన్నత స్థానాల్లో ఉన్నవారే పాత్రధారులు కావడంతో విచారణకు వెనుకంజ వేస్తున్నారు. మౌఖికంగా విచారణ చేశామని, లంచం ఇవ్వలేదని నర్సులు చెబుతున్నారని రిమ్స్ డెరైక్టర్ హేమంత్‌రావు పేర్కొనడం గమనార్హం. మరోపక్క ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని సూపరింటెండెంట్ అశోక్ చెబుతుండడం మరో కోణం.
కమిటీకి వెనుకంజ..
సాధారణంగా ఒక శాఖలో అవినీతి జరిగితే ఉన్నతాధికారులు కమిటీ ఏర్పాటు చేసి దానిపై విచారిస్తారు. ఈ వ్యవహారంలో ఉన ్నతాధికారులే సూత్రధారులు కావడంతో రి మ్స్‌లో లంచం ఇస్తేనే కొత్త పీఆర్సీ విచారణ అటకెక్కే పరిస్థితి నెలకొంది. నామమాత్రం గా మౌఖికంగా విచారణ చేశామని, అందు లో లంచం ఇచ్చినట్లు ఎవరూ చెప్పలేదని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సులు లంచానికి సంబంధించి వ్యక్తిగతంగా రాతపూర్వకంగా ఫిర్యా దు చేసే పరిస్థితి లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా తమను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని వేధించే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. అసోసియేషన్ ఆధారంగా ఫిర్యాదు చేయాలన్నా.. అందులోనూ రిమ్స్ ఉన్నతాధికారులకు చెందిన వ్యక్తులదే ముఖ్య భూమిక ఉండడంతో వెనుకంజ వేస్తున్నారు. లంచానికి సంబంధించి ఇతర శాఖల అధికారులతో విచారణ జరిపిస్తే అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉంది. మొదట రూ.500 చొప్పున రూ.లక్షా 30 వేలు వసూలు చేసిన అధికారులు అవి సరిపోవంటూ మరో రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని వేధించారని నర్సుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన మరో రూ.2 లక్షల 60 వేలు వసూలుకు అధికారులు కన్నేశారు.
‘సాక్షి’లో కథనంతో..
ఈ వ్యవహారంపై ‘సాక్షి’లో కథనం రావడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. పీఆర్సీ విషయంలో పలువురు నర్సులను పిలిపించి అధికారులు వ్యవహారాన్ని సద్దుమణిగేలా ప్రయత్నించారని స్పష్టమవుతోంది. మొదట వసూలు చేసిన డబ్బులను కూడా తిరిగి ఇస్తామని, విషయం బయటకు ఎవరికీ చెప్పవద్దని నర్సులను ప్రాధేయపడినట్లు సమాచారం. ఒక ఏవో సెలవుపెట్టి వెళ్లిపోయారు. కాగా.. రిమ్స్ ఉన్నతాధికారితోపాటు ముఖ్య స్థానాల్లో ఉన్న పలువురికి ఇందులో వాటా ఉండడంతో బయటకు పొక్కకుండా అంతా గప్‌చుప్ చేసేస్తున్నారని వినికిడి. ఇదిలా ఉంటే రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీకి జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి చైర్మన్‌గా ఉన్నారు. కలెక్టర్ ఎం. జగన్మోహన్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎంపీ సభ్యులుగా ఉన్నారు. కో చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి విచారణకు కమిటీ వేసి.. అందులోనూ ఇతర శాఖ అధికారులతో విచారణ జరిపితే పూర్తిస్థాయిలో వ్యవహారం బయటకు వస్తుందని పలువురు అంటున్నారు. ఇదిలా ఉంటే రిమ్స్‌లో సంచలనం రేపిన ఈ కథనంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హైదరాాబాద్ నుంచి మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన రిమ్స్ డెరైక్టర్ హేమంత్‌రావు నర్సుల పీఆర్సీ డాక్యుమెంట్లను తెప్పించుకుని మరీ సంతకాలు పెట్టారు. సెక్షన్ సిబ్బంది కూడా పనిని వేగవంతం చేశారు.