అదనంగా నిధులు అవసరమా?
అయితే సప్లిమెంటరీ ప్రతిపాదనలు పంపండి
అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల కన్నా అదనపు నిధులు అవసరమైన పక్షంలో, అలాగే బడ్జెట్ కేటాయింపులకంటే ఎక్కువ నిధులను ఇప్పటికే వ్యయం చేసినట్లయితే అందుకు సంబంధించిన ప్రణాళిక, ప్రణాళికేతర పద్దు కింద సప్లిమెంటరీ ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పూర్తి వివరణతో వాటిని పంపించాలని అన్ని శాఖలను కోరింది. ఇందులో రెవెన్యూ వ్యయానికా లేదా ఆస్తుల కల్పన వ్యయానికా లేదా అప్పులు తీర్చడానికా అనేది స్పష్టం చేయాలని తెలిపింది.
అంతేగాక సంబంధిత ముఖ్య కంట్రోలింగ్ అధికారి ఆ శాఖలో ఆ పద్దు కింద నిధులు లేవని సర్టిఫికెట్ చేయాలంది. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం మంజూరు చేసిన పక్షంలో అదనపు నిధులు అవసరమైనా లేదా బడ్జెట్లో కేటాయింపులు చాలకున్నా సప్లిమెంటరీ ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది.బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి సవరించిన అంచనాలను ఆయా శాఖలకు పంపిన విషయాన్ని తెలియజేస్తూ.. వాటిని మించకుండా సప్లిమెంటరీ ఉండాలని, ఒకవేళ సవరించిన అంచనాల అనంతరం ప్రభుత్వం ఏదైనా పథకాన్ని మంజూరు చేసినట్లేతే ఆ విషయాన్ని స్పష్టంగా చేయాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.
హోం, రహదారులు-భవనాలు, సాధారణ పరిపాలన, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మున్సిపల్, సాగునీటి, అటవీ శాఖలు కంటింజెన్సీ నిధి నుంచి అడ్వాన్స్‌గా రూ.10.93 కోట్లు తీసుకున్నాయని, వాటికి సప్లిమెంటరీ పంపాలంది. ప్రణాళికేతర పద్దుకు మార్చండి ప్రణాళిక పద్దు నుంచి ప్రణాళికేతర పద్దుకు మార్చిన నిధులను ఆయా శాఖలు అందుకు అనుగుణంగా సంబంధిత హెడ్స్‌లో మార్పులు చేయాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.