Surendra Jain
-
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్‌పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్‌పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్ హెచ్చరించారు. సిట్‌లో చంద్రబాబు మనిషితిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. -
లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. -
'అలా చేస్తే... స్వయంగా స్వాగతం చెబుతా'
లక్నో: హేతువాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సాహిత్య అకాడమీ అవార్డులను రచయితలు వెనక్కు ఇచ్చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) నేత సురేంద్ర జైన్ తీవ్రంగా ఆక్షేపించారు. సౌదీ అరేబియా వెళ్లి పంది మాంసం గురించి అడగ్గాలరా అని ప్రశ్నించారు. వీహెచ్ పీ సమావేశాల్లో జైన్ మాట్లాడారు. 'ఇలా చేసి, సౌదీ అరేబియా నుంచి ప్రాణాలతో తిరిగొస్తే.. నేనే స్వయంగా వెళ్లి వారికి స్వాగతం చెబుతా. లేకుంటే బూటకపు ప్రకటనలు మానుకోవాలి' అని జైన్ అన్నారు. దాద్రి ఘటన తర్వాత వీహెచ్ పీ సీనియర్ నేత ఒకరు ప్రత్యక్ష ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది మాంసారం తింటారని, వీరి ఆహారపు అలవాట్లను మార్చాలన్న ఉద్దేశం వీహెచ్ పీ, సంఘ్ పరివార్ కు లేదని జైన్ అన్నారు. 'గోమాంసం వినియోగంపై నిషేధం విధించమని మాత్రమే మేము కోరుతున్నాం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోవులను వధించొద్దని, మా మనోభావాలు దెబ్బతీయొద్దని కోరుకుంటున్నాం' అని జైన్ వ్యాఖ్యానించారు. గోమాంసం నిషేధంపై ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన యూపీ మంత్రి ఆజంఖాన్ ను పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. -
'రామమందిరం కట్టకపోతే మోదీ సర్కారు గతి అంతే'
అయోధ్యలో రామమందిరం నిర్మించని పక్షంలో నరేంద్రమోదీ సర్కారుకు కూడా గతంలోఅటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని వీహెచ్‌పీ హెచ్చరించింది. గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసింది కేవలం అభివృద్ధిని చూసి మాత్రమే కాదని, వాళ్ల ప్రధాన ఆకాంక్షలను కూడా నెరవేరుస్తారని భావించారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి, జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, తమ ఆశలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రధాన ఆకాంక్షలు నెరవేర్చాలంటే లోక్‌సభలో బీజేపీకి 370 సీట్లు కావాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము అభివృద్ధిపైనే దృష్టి పెట్టాము తప్ప.. ఇతర అంశాలపై కాదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంతకుముందు అన్నారు. రామమందిర నిర్మాణం కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విషయాన్ని సురేంద్ర జైన్ గుర్తుచేశారు. ఈ అంశంపై వాళ్లు ఎలా వెనక్కి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్డీయే ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించలేదు కాబట్టే ఓటర్లు వాళ్లను తిప్పి పంపేశారని చెప్పారు. బీజేపీ నాయకులు తమ గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మిక పెద్దలతో కూడిన కమిటీ ఒకటి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, రామమందిర నిర్మాణం గురించి ఆయనకు విజ్ఞప్తి చేయాలని సురేంద్ర జైన్ కోరారు. ఆయోధ్యలో మందిరం గురించి కూడా నరేంద్రమోదీ తన 'మన్ కీ బాత్'లో చెప్పాలని బీజేపీ మిత్రపక్షం శివసేన ఇటీవల డిమాండు చేసిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదు - రామజన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. -
ఎక్కువ మంది పిల్లల్ని కనండి
హిందువులకు వీహెచ్‌పీ పిలుపు ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తేవాలని డిమాండ్ న్యూఢిల్లీ: దేశ జనాభాలో ఏర్పడుతున్న అసమతౌల్యాన్ని సరిదిద్దేందుకు ఉమ్మడి పౌరస్మృతిని వెంటనే తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. దేశంలోని హిందువులంతా ముస్లింల మాదిరే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చింది. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందన్న పలు అంచనాల నేపథ్యంలో... వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. హిందువులు ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలన్న వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వ్యాఖ్యలపై లౌకికవాదులు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ‘దేశంలో జనాభా అసమతౌల్యాన్ని సరిదిద్దడానికి రెండే మార్గాలున్నాయి. అవి హిందువులు తమ జనాభాను పెంచుకోవడం లేదా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం. ఇన్నాళ్లూ దేశాన్ని సెక్యులరిజం పేరిట తప్పుదోవ పట్టించారు. దేశం మొత్తం కశ్మీర్లాగానో, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్లాగానో చేయాలని సెక్యూలరిస్టులు కోరుకుంటున్నారా?.. ఉమ్మడి పౌరస్మృతి తేవాలనేది పూర్తిగా సెక్యులర్ డిమాండ్. ఇది ఎవరికైనా మతవాదంగా కనిపిస్తే.. వారే పూర్తిస్థాయి మతవాదుల కింద లెక్క. అలాంటివారు దేశం విడిచి పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చు..’ అని జైన్ పేర్కొన్నారు. ముస్లింల తరహాలోనే హిందువులు కూడా వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయం నిర్మించడానికి ఉన్న అడ్డంకులను త్వరగా తొలగించాలని.. ఇంకా జాప్యం చేస్తే హిందువుల్లో సహనం నశిస్తుందని అన్నారు. కాగా ఇతర మతాల్లో ఉన్నవారిని హిందూమతంలోకి తీసుకొచ్చే ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.