'రామమందిరం కట్టకపోతే మోదీ సర్కారు గతి అంతే'
అయోధ్యలో రామమందిరం నిర్మించని పక్షంలో నరేంద్రమోదీ సర్కారుకు కూడా గతంలోఅటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని వీహెచ్పీ హెచ్చరించింది. గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసింది కేవలం అభివృద్ధిని చూసి మాత్రమే కాదని, వాళ్ల ప్రధాన ఆకాంక్షలను కూడా నెరవేరుస్తారని భావించారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి, జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, తమ ఆశలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రధాన ఆకాంక్షలు నెరవేర్చాలంటే లోక్సభలో బీజేపీకి 370 సీట్లు కావాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము అభివృద్ధిపైనే దృష్టి పెట్టాము తప్ప.. ఇతర అంశాలపై కాదని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంతకుముందు అన్నారు.
రామమందిర నిర్మాణం కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విషయాన్ని సురేంద్ర జైన్ గుర్తుచేశారు. ఈ అంశంపై వాళ్లు ఎలా వెనక్కి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్డీయే ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించలేదు కాబట్టే ఓటర్లు వాళ్లను తిప్పి పంపేశారని చెప్పారు. బీజేపీ నాయకులు తమ గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మిక పెద్దలతో కూడిన కమిటీ ఒకటి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, రామమందిర నిర్మాణం గురించి ఆయనకు విజ్ఞప్తి చేయాలని సురేంద్ర జైన్ కోరారు. ఆయోధ్యలో మందిరం గురించి కూడా నరేంద్రమోదీ తన 'మన్ కీ బాత్'లో చెప్పాలని బీజేపీ మిత్రపక్షం శివసేన ఇటీవల డిమాండు చేసిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదు - రామజన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే.