'అలా చేస్తే... స్వయంగా స్వాగతం చెబుతా'
లక్నో: హేతువాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సాహిత్య అకాడమీ అవార్డులను రచయితలు వెనక్కు ఇచ్చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) నేత సురేంద్ర జైన్ తీవ్రంగా ఆక్షేపించారు. సౌదీ అరేబియా వెళ్లి పంది మాంసం గురించి అడగ్గాలరా అని ప్రశ్నించారు. వీహెచ్ పీ సమావేశాల్లో జైన్ మాట్లాడారు.
'ఇలా చేసి, సౌదీ అరేబియా నుంచి ప్రాణాలతో తిరిగొస్తే.. నేనే స్వయంగా వెళ్లి వారికి స్వాగతం చెబుతా. లేకుంటే బూటకపు ప్రకటనలు మానుకోవాలి' అని జైన్ అన్నారు. దాద్రి ఘటన తర్వాత వీహెచ్ పీ సీనియర్ నేత ఒకరు ప్రత్యక్ష ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.
దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది మాంసారం తింటారని, వీరి ఆహారపు అలవాట్లను మార్చాలన్న ఉద్దేశం వీహెచ్ పీ, సంఘ్ పరివార్ కు లేదని జైన్ అన్నారు. 'గోమాంసం వినియోగంపై నిషేధం విధించమని మాత్రమే మేము కోరుతున్నాం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోవులను వధించొద్దని, మా మనోభావాలు దెబ్బతీయొద్దని కోరుకుంటున్నాం' అని జైన్ వ్యాఖ్యానించారు. గోమాంసం నిషేధంపై ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన యూపీ మంత్రి ఆజంఖాన్ ను పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.