కుక్క మాంసం నిషేధంపై రగడ
బీఫ్ నిషేధం గురించిన వివాదం ఇంకా కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు మరో సరికొత్త వివాదం తెరమీదకు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలలో కుక్క మాంసాన్ని నిషేధిస్తూ కేంద్ర మంత్రి మేనకా గాంధీ తీసుకున్న నిర్ణయంపై నాగాలాండ్ వాసులు మండిపడుతున్నారు. నాగాలాండ్, మిజొరాం తదితర రాష్ట్రాలలో ఉన్న నాగా తెగలు, మరికొన్ని తెగలలో కుక్క మాంసం వినియోగం చాలా ఎక్కువ. ఈశాన్య ప్రాంతానికి చెందిన మంత్రి జితేంద్ర సింగ్‌కు కొన్ని రోజుల క్రితం మేనకా గాంధీ ఒక లేఖ రాశారు. ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులను ఆహారం కోసం చంపకూడదని ఉన్న నిబందనను అందులో పేర్కొన్నారు. కుక్క మాంసం వినియోగించడం చట్టవిరుద్ధం, అమానుషం అని ఆమె చెప్పారు.
అయితే తామేం తినాలో వద్దో చెప్పే అధికారం మేనకాగాంధీకి లేదని.. నాగాలాండ్‌లో ఆ చట్టాలు అమలుకావని నాగాలు అంటున్నారు. నాగాలాండ్‌కు ఉన్న ప్రత్యేక హోదా దృష్ట్యా ఇక్కడ సామాజిక ఆచారాలను కాపాడుకోడానికి వీలుందని, దాని ప్రకారం ఆహార అలవాట్లు, మతాచారాల విషయంలో భారతీయ చట్టాలను ఇక్కడ అమలుచేయడం కుదరదని చెప్పారు. కొన్ని తరాలుగా తాము కుక్క మాంసం తింటున్నామని, ఇది ఒక చికిత్సగా కూడా ఉపయోగపడుతుందని.. అలాంటిది ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి చెప్పారని నాగాలాండ్‌కు చెందిన నాగా హోహో సంస్థ అధ్యక్షుడు చుబా ఒజుకుమ్ చెప్పారు. కుక్క మాంసం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తే నాగాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలిపారు.
అయితే, తాము క్రూరత్వం విషయాన్ని పరిశీలిస్తున్నట్లు నాగాలాండ్ ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కుక్కలు, ఇతర జంతువులను ఆహారం కోసం వినియోగించేటప్పుడు తగిన విధంగా శుద్ధి చేయాలని, ఇతర నిబంధనలను కూడా వ్యాపారులు కచ్చితంగా పాటించాలని ఆరోగ్యశాఖ కమిషనర్, కార్యదర్శి అయిన అభిజిత్ సిన్హా అన్నారు. రాష్ట్రంలో కుక్క మాంసంపై నిషేధం విధించడం చాలా కష్టమని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఆర్బి తాంగ్ అన్నారు. నాగాలాండ్‌లో కుక్క మాంసానికి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ కిలో 300-500 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ మాంసం కోసం ప్రత్యేకంగా కుక్కలను పెంచరు కాబట్టి, అసోం లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేస్తుంటారు.