గత సర్జికల్ దాడుల రికార్డులు లేవు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వెల్లడి
న్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్ 29వ తేదీ కంటే ముందు చేపట్టిన సర్జికల్ దాడులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) తెలిపింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ప్రశ్నకు డీజీఎంఓ సమాధానమిచ్చింది. ఇండియన్ ఆర్మీ రికార్డులో సర్జికల్ దాడులకు ఎలాంటి నిర్వచనం ఉందో తెలపాల్సిందిగా అతను దరఖాస్తులో కోరాడు. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమధానమిస్తూ ‘ఇంటెలిజెన్స్ సమాచారంతో నిర్దేశిత లక్ష్యంపై వేగంగా, కచ్చితమైన దాడులు చేయడాన్ని’సర్జికల్ దాడులుగా పేర్కొంది.
అంతేకాకుండా భారత సైన్యం చరిత్రలో 2016 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన సర్జికల్ దాడులే మొదటిదా లేక 2004–2014 మధ్యలో ఏమైనా సర్జికల్ దాడులు జరిగాయా తెలపాలని దరఖాస్తులో కోరాడు. ఇంటిగ్రేటేడ్ హెడ్‌క్వార్టర్స్ (ఆర్మీ)కి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును బదిలీ చేసింది.