కలెక్టర్‌ను హీరోయిన్లా ఉన్నారని..
ఓ జిల్లా కలెక్టర్‌ను పట్టుకుని మీరు హీరోయిన్లా ఉన్నారని, కానీ ఇంతకు ముందెప్పుడు తెరమీద నటిస్తుండగా చూడలేదన్న ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్ మాట్లాడారు. సర్గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్‌ను చూసి, ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అన్నారు.
అంతటితో ఆగకుంగా.. తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ లాంటి పిచ్చివాడిని చూడలేదని అన్నారు. సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భగత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీంతో స్పందించిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను అడ్డగించడం, తప్పుడు వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.