రాజధానిలో రాజ్‌నాథ్ ఆకస్మిక తనిఖీలు
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రి, పోలీస్ స్టేషన్, మునిసిపల్ కార్యాలయం, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని మరుగుదొడ్డి తీరును తొలుత రాజ్‌నాథ్ పరిశీలించారు. కూలీలు, ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడారు. అనంతరం శివాజీ స్టేడియం బస్టాప్ వద్ద ఆగి బస్సులు వేళకు వస్తున్నాయా? లేదా తెలుసుకున్నారు. దీంతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు.
సులభ్ మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంతో మెరుగుపరచాలంటూ నిర్వాహకుడిని ఆదేశించారు. పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నిందితులను ఉంచే లాకప్ గదులు శుభ్రంగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించారు. ఫిర్యాదుల స్థితిగతులపై ప్రశ్నించారు. మునిసిపల్ కార్పొరేషన్ సిటీ జోన్ కార్యాలయం అస్తవ్యస్తంగా ఉండడంపట్ల రాజ్‌నాథ్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పరిశుభ్రంగా మార్చాలని డిప్యూటీ కమిషనర్ హేమేంద్రకుమార్ను ఆదేశించారు. జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిని కూడా సందర్శించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో సేవలు సంతృప్తికరంగా ఉంటే, మరికొన్ని చోట్ల మెరుగుపడాల్సి ఉందని రాజ్‌నాథ్ విలేకరులతో అన్నారు. రాజ్‌నాథ్ వెంట లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సి కూడా ఉన్నారు.