పంట పొలాల్లో.. సర్వే జెండాలు
తొలగించాలని పట్టుబట్టిన రైతులు
చర్చలకు రావాలని కోరిన డిప్యూటీ కలెక్టర్
ఎమ్మెల్యే ఆర్కేతో మాట్లాడాలని చెప్పిన అన్నదాతలు
చేసేదేంలేక జెండాలు తొలగించిన అధికారులు
పెనుమాక (తాడేపల్లి రూరల్) : రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల పంటపొలాల్లో అనుమతి లేకుండా పెనుమాక సీఆర్డీఏ అధికారులు, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు సోమవారం సర్వే జెండాలు పాతారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాల వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. దాదాపుగా 15 ఎకరాల్లో పాతిన సర్వే జెండాలను సీఆర్డీఏ అధికారులే తొలగించాలని రైతులు పట్టుబట్టారు. సర్వేబృందం జెండాలు తొలగించకుండా సమాచారాన్ని పెనుమాక సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులకు తెలియజేశారు. చర్చలకు రావాలంటూ ఆయన రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జాయింట్ కలెక్టర్ వస్తున్నారు.. ఆమె చూశాక జెండాలు తీసేస్తామని చెప్పినప్పటికీ రైతులు ఏమాత్రం ఒప్పుకోలేదు.
పూలింగ్‌కు ఇవ్వలేదని మీ దగ్గర ఆధారాలున్నాయా..!
డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ భూములను మీరు పూలింగ్‌కు ఇవ్వలేదని ఏమైనా ఆధారాలున్నాయా.. అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆగ్రహించిన రైతులు పచ్చని పంటపొలాల్లో, పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో రోడ్లు వేయమంటూ ఏమైనా పత్రాలు ఉన్నాయా.. అంటూ చూపించాలని రైతులు నిలదీశారు. పెనుమాకలో రైతులందరూ కోర్టును ఆశ్రయించారని, దానికి సంబంధించిన సమాచారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్ద ఉందని, మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఆయనతోనే మాట్లాడాలని రైతులు తేల్చి చెప్పారు.
జెండాలు తీయకుంటే మిమ్మలను ఇక్కడ నుంచి కదలనిచ్చేదిలేదంటూ రైతులు ఆగ్రహించారు. జేసీ వచ్చే వరకూ ఆగాలంటూ అధికారులు సూచించారు. రైతులు మీ ఇంట్లోకి వచ్చి మేం కూర్చుంటే మీరు ఊరుకుంటారా.. పచ్చని పంట పొలాల్లోకి వచ్చి ఇలా జెండాలు పాతి సర్వేలు చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జెండాలు తొలగించకుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుతో పాటు జెండాలు పాతిన వారిపై కోర్టును ఆశ్రయిస్తామంటూ రైతులు తేల్చి చెప్పారు. చివరకు చేసేదేంలేక జెండాలను అధికారులు తొలగించారు.
అధికారులూ.. దోషులు కావొద్దు : ఎమ్మెల్యే ఆర్కే
అడ్డగోలుగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దు.. అలా చేస్తే కోర్టులో మీరు దోషులుగా నిలబడాల్సి వస్తుంది.. అని ఎమ్మెల్యే ఆర్కే అధికారులను హెచ్చరించారు. బహుళ పంటలు పండే ఉండవల్లి, పెనుమాక భూముల్లో రైతులు పంటలు పండించుకోవచ్చని చెప్పారు. సమస్య కోర్టులో ఉండగానే రైతుల పంటపొలాలు నాశనం చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు.. రేపు మరో ప్రభుత్వం రావొచ్చు. కానీ మీరు మాత్రం జీవితకాలం ప్రజలకు సేవలందిస్తూ ఉండాలి.. వారి అభిప్రాయానికి విరుద్ధంగా వెళ్లొద్దని అధికారులకు ఆయన సూచించారు.