భూటకపు సర్వేలు ఆపండి
పూండి(వజ్రపుకొత్తూరు): భావనపాడు తీరంలో ప్రతిపాదిత ఓడరేవు నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న భూటకపు సర్వేలు ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పైల చంద్రమ్మ డిమాండ్ చేశారు. శనివారం ఆమె తన బృందంతో కలిసి భావనపాడు గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం పూండిలో విలేకరులతో మాట్లాడారు. పోర్టు నిర్మాణం కోసం సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లోని తొమ్మిది గ్రామాల పరిధిలో పది వేల ఎకరాలకు పైబడి భూములు సేకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించు కోవాలని, లేకుంటే ప్రజా పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
దేవునల్తాడ, భావనపాడు, మర్రిపాడు, పొల్లాడ, కొమరల్తాడ ప్రాంతాల్లో రైతులు పోర్టుకు తమ భూములు ఇచ్చేందుకు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమ బాటపడుతున్న విషయాన్ని ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. రైతులు, మత్స్యకారులు పోర్టు, ఫిషింగ్ హార్బర్లను వ్యతిరేకిస్తున్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేను మారాను, ప్రజల అభిప్రాయం లేకుండా ఏ పని ముందుకు తీసుకుపోను అంటూనే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూముల సేకరణకు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారంటూ మండిపడ్డారు. పంచాయతీల తీర్మాణాలు లేకుండా భూ సేకరణ చేపట్టే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా సీనియర్ నాయకురాలు పోతనపల్లి జయమ్మ, వంకల పాపయ్య పాల్గొన్నారు.