సీమాంధ్రలో ఆర్టీసీకి రూ.1,100 కోట్ల నష్టం
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఆర్టీసీకి 1,100 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) సూర్యచంద్రరావు వెల్లడించారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక ఆర్ఎం కార్యాలయంలో ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల 650 కోట్ల రాబడిని ఆర్టీసీ కోల్పోయిందన్నారు. సమ్మె కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు 15 వేలు, రెగ్యులర్ ఉద్యోగులకు 25 వేల రూపాయల చొప్పున అడ్వాన్స్‌లు చెల్లించామని, వాటితో పాటు పర్యవేక్షణ, ఇతర అంతర్గత నష్టం కలిపి 150 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.
దీనికితోడు కార్మికులకు సమ్మె కాలాన్ని వారి సెలవుల్లో మినహాయించామని, దీనికోసం 300 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. అలా మొత్తం కలిపి 1,100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఈడీ వివరించారు. ఇక నెల్లూరు జోన్ పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. అంతేగాకుండా ఈ జోన్ పరిధిలో 600 బస్సుల బ్యాటరీలు పాడైపోయాయని తెలిపారు. సుమారు రెండు నెలల పాటు బస్సులు తిరగకపోవడం వల్ల అలా జరిగిందన్నారు. ఒక్కో బ్యాటరీ ఖరీదు 5 వేల రూపాయలు ఉంటుందన్నారు. వాటివల్ల మొత్తం 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. బస్సులు ఎక్కువకాలం తిరగకపోవడం వల్ల వాటి టైర్ల మన్నికపై కూడా ఆ ప్రభావం పడుతుందన్నారు. ఈ నష్టాన్ని మొత్తం భర్తీ చేయడం సాధ్యంకానిపనని, చార్జీల పెంపు మాత్రం అనివార్యమని చెప్పారు.
లక్ష్యాలు అధిగమించాలి...
సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని ఎలాగో భర్తీ చేయలేమని, అధికారులు, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేసి ఇకపై నెలవారీ లక్ష్యాలనైనా అధిగమిస్తే కొంత ఉపయోగం ఉంటుందని ఈడీ సూర్యచంద్రరావు సూచించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నష్టాన్ని కొంతమేరకైనా భర్తీ చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. విద్యాసంస్థలకు సెలవులు రద్దుచేస్తూ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కారణంగా సంక్రాంతి పండుగకు సైతం రద్దీ ఉండే అవకాశం లేదన్నారు. దానివల్ల ఆ సీజన్లో ఆర్టీసీకి వచ్చే 1.50 కోట్ల రూపాయల ఆదాయం ఈసారి వచ్చే అవకాశం లేదన్నారు. సమ్మె కాలంలో ప్రైవేటు వాహనాల నిలువుదోపిడీని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీసీని ఆదరిస్తారని తాము భావిస్తున్నామన్నారు.
వచ్చే ఏడాది సిటీ సర్వీసులు...
జేఎన్యూఆర్ఎం పథకం కింద 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒంగోలుకు సిటీ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ఈడీ పేర్కొన్నారు. మొత్తం 40 సర్వీసులు వస్తాయని, వాటిని 30 కిలోమీటర్ల పరిధిలో నడిపే అవకాశం ఉందని తెలిపారు. వాటివల్ల ఒంగోలు నగర, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మూడు నెలలుగా అద్దె కట్టకపోవడం వల్ల ఒంగోలు బస్టాండ్‌లో మూడు స్టాల్స్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. బకాయిలున్న వారు నవంబర్ 10వ తేదీలోగా పూర్తిగా చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్దె బస్సుల యజమానులు కూడా నష్టపోయిన మాట వాస్తవమేనని, కాకుంటే బస్సులు రెండు నెలలపాటు నడపకపోవడం వల్ల వారితో ఉన్న ఒప్పందాన్ని మరో రెండునెలల పాటు పొడిగించే ప్రతిపాదన ఉందని తెలిపారు. రీజియన్ పరిధిలోని జిల్లాల్లో గల ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈడీ పేర్కొన్నారు. సమావేశంలో రీజియన్ పరిధిలోని పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.