బల పరీక్ష
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌లపై డెరైక్టర్లు తిరుగుబావుటా ఎగురవేయడం, అవిశ్వాసానికి నోటీసులు జారీ చేయడంతో బలపరీక్ష అనివార్యంగా మారింది. ఈ మేరకు డీసీవో సూర్యచంద్రరావు అధ్యక్ష ఎన్నికపై చర్చ, బలపరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 7న డీసీసీబీ, 11న డీసీఎంఎస్ అవిశ్వాస తీర్మానాలపై ప్రత్యేక సమావేశాలు ఉంటాయి.
డీసీసీబీలో 21 మంది డెరైక్టర్లు ఉండగా, 11 మంది సభ్యులు హాజరైతే కోరం సరిపోతోంది. 2/3 వంతు(14 మంది) మెజార్టీతో ఎన్నిక జరుగుతుంది. చెయ్యెత్తే విధానంతో ఓటింగ్ ఉంటుంది. డీసీఎంఎస్‌కు డెరైక్టర్లు 10 మంది, సభ్యులు 10 మంది ఉంటారు. కోరం ఆరుగురు, కాగా 2/3 వంతు (7 గురు) సభ్యులతో ఓటింగ్ విధానంతో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మెజార్టీ ఓట్లతో గెలుపోటములు ప్రకటిస్తారు. పీఏవైసీ(ప్రాథమిక) వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల మీద ఆ సంఘాల డెరైక్టర్లు ఆవిశ్వాసం ప్రవేశ పెట్టడంతో వాటికి కూడా ప్రత్యేక సమావేశాలు ప్రవేశపెట్టారు. ఆగస్టు 12న సారంగాపూర్ మండల కౌట్ల(బి), 13న మంజులాపూర్, బజార్‌హత్నూర్‌లలో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి.
వేడెక్కిన సహకార రాజకీయం
అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో సహకార రాజకీయం వేడెక్కింది. ఎవరి నోట విన్న జిల్లాలో సహకార చర్చ జోరుగా సాగుతోంది. చైర్మన్ గిరిలను వశం చేసుకోవడానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం సహకార బ్యాంకుల్లో 21 మంది డెరైక్టర్లు ఉండగా అందులో ఒకరు రాజీనామా చేశారు. మిగిలిన 20 మందిలో 11 మంది డెరైక్టర్ల సంతకాలతో జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌కు అవిశ్వాస తీర్మానం అందించారు. ఈ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని హైదరాబాద్‌లోని సహకార కమిషనర్ కార్యాయానికి పంపించారు.
అవిశ్వాస తీర్మానం పై సంతకాలు చేసిన 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడంలో కీలకపాత్ర పోషించిన డీసీసీబీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వైపు 11 మంది ఉన్నట్లు ఆ వర్గీయులు చెబుతున్నారు. ఈ ఓటింగ్‌లో విజయం సాధించాలంటే మరో ముగ్గురు సభ్యులు అవసరం ఉంది. వారికోసం ప్రయత్నాలు ముమ్మర ం చేస్తున్నారు. ప్రస్తుత డీసీసీబీ అధ్యక్షుడు తన పదవిని కాపడుకునెందుకు తన దైన శైలిలో పావులు కదుపుతున్నారు. పార్టీని వీడేందుకు కూడా డీసీసీబీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు, టీఆర్‌ఎస్‌లోని ముఖ్య నాయకులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.