‘రుణమాఫీతో 2 కోట్ల రైతులకు లబ్ధి’
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తర్వలో అమలుచేయనున్న రుణమాఫీతో దాదాపు 2 కోట్ల చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ సహాయ్ వెల్లడించారు. ప్రస్తుతం రుణమాఫీ విధివిధానాలపై తమ సర్కారు పనిచేస్తోందని ఆయన తెలిపారు. చాలా మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదనీ, ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని సహాయ్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ కల్లా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మార్కెట్లను జాతీయ ఆన్లైన్ వ్యవసాయ మార్కెట్ ఈ–మండీకి అనుసంధానం చేస్తామని ప్రకటించారు. దీనివల్ల కొనుగోలు, అమ్మకాల్లో పారదర్శకత పెరగుతుందన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం వ్యాపారులకు రూ.లక్షగా ఉన్న లైసెన్స్ ఫీజును తగ్గిస్తామని సహాయ్ హమీనిచ్చారు. 2017–18 ఏడాదికి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని వెల్లడించారు. జూన్‌కల్లా దాదాపు 75 లక్షల సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలతో పాటు వ్యవసాయ పనిముట్లను అందించడంలో పారదర్శకత పాటిస్తామన్నారు. 2017–18 ఏడాదికి బుందేల్‌ఖండ్ ప్రాంతంలో దాదాపు 2,000 చెరువులు తవ్వే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సహాయ్ ప్రకటించారు.