పట్టాలెక్కని డబుల్‌డెక్కర్
నాలుగు నెలలు గడిచినా ఊసే లేని వైనం
సాక్షి, సిటీబ్యూరో: నెల రోజుల్లోనే అందుబాటులోకొస్తుందన్నారు. ఎంతో ఆర్భాటంగా పరిచయం చేశారు. కానీ ఇప్పటి వరకు డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కలేదు. నగరం నుంచి తిరుపతి, గుంటూరు స్టేషన్లకు న డిపేందుకు ఇటీవల డబుల్ డెక్కర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసింది. భద్రతాపరమైన పరీక్షలు, ట్రయల్ రన్ అనంతరం ఇది పట్టాలెక్కేస్తుందని అప్పట్లో రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా డబుల్ డెక్కర్‌లో కదలిక లేదు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరీక్షలు నిర్వహించలేదు.
గతేడాది నుంచి ఊరిస్తున్న డబుల్‌డెక్కర్ రైలు... కనీసం ట్రయల్న్‌క్రు కూడా నోచుకోకపోవడం నిజంగా విస్మయం కలిగించే విషయమే. భద్రతా కమిషన్ నివేదిక అందితే గానీ రైలు అందుబాటులోకి రావడం అసాధ్యమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ రైలు ఉండీ లేనట్లే అయింది. దేశంలో ప్రస్తుతం నడిచే డబుల్ డెక్కర్ రైళ్లన్నింటి కంటే మరింత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు కాచిగూడ నుంచి తిరుపతికి, కాచిగూడ నుంచి గుంటూరుకు నడపాలని ప్రతిపాదించారు.
దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటిసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైలు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇతర రద్దీ మార్గాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. సీటింగ్ సదుపాయం మాత్రమే ఉన్న ఈ రైలు అన్నివిధాలుగా సురక్షితమైంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థను మొట్టమొదటిసారి ఇందులో ప్రవేశపెట్టారు.
దేశంలో ఆరోది...
ప్రస్తుతం దేశంలో ఐదు డబుల్‌డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. నగరానికి ప్రకటించింది ఆరోది. ఇందులో 14 ఏసీ చైర్కార్లు, 3 పవర్ బోగీలు ఉంటాయి. పూర్తిగా ఏసీ.
ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48, అప్పర్ డెక్‌లో 50, మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి
బోగీకి 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి
భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్ కాచిగూడ-గుంటూరు బై వీక్లీ, కాచిగూడ -తిరుపతి బై వీక్లీగా నడువనుంది.
కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ పగటి పూట మాత్రమే నడుస్తుంది.