కుటుంబం నుండి వర్మ ఎందుకు విడిపోయారు?
వర్మయోగి
స్వప్నలోకం
ఈ మధ్య రాంగోపాల్‌వర్మ అమ్మగారిని కలిశాను. అసలు ఇంత వైపరీత్యాన్ని ప్రకటించి మరీ చాటుకునే తనయుడి తల్లికి ఆ కొడుకు ఎలా కన్పిస్తాడా అని డౌట్ వచ్చింది. ఆ సందేహానికి సమాధానంగా సూర్యవతిగారి సరళమైన మాటల్లో అంతర్లీనమైన జ్ఞానం వినిపించింది. గీత లోపలి పరిమితులు, పద్ధతులకీ , గీతదాటాక వచ్చే స్వేచ్ఛకీ మధ్య ఉండే పొరలపై బలమైన అవగాహన కనిపించింది.
ఆమెతో సంభాషణలోని కొన్ని విషయాలు:
రాంగోపాల్‌వర్మ తనెప్పుడూ చెడ్డవాడినని చెప్పుకుంటారు. నిజమా?
కొడుకని ప్రేమకాదు, కానీ చెడ్డతనమంటే వాడికి అసలు తెలీదు. ఇది చాలా నిజాయితీగా చెప్తున్న మాట.
అయితే ఆర్జీవీ అలా ఎందుకు చెప్పుకుంటారు?
ఎందుకంటే, మరొకరు మాటలు అనకుండా తనకు తానే అనేస్కుంటాడు! (నవ్వు) సంజాయిషీ చెప్పే పరిస్థితి రాకుండా ఉండడం కోసం.
వర్మ మిమ్మల్ని పట్టించుకుంటారా? కుటుంబం నుండి దూరంగా ఉంటారు కదా!
అందరూ నన్ను ఏమడుగు తారంటే ‘‘అయ్యో పాపం రామూ మిమ్మల్ని సరిగ్గా చూస్కోరేమో కదా’’ అని! వాడికెంత ప్రేముందో నాకు తెలుసు. మూడో వ్యక్తికి ఇది అర్థం కాకపోవచ్చు.
మరి కుటుంబం నుండి ఎందుకు విడిపోయారు?
రాము చేసిన ఒకే ఒక తప్పు తన జీవితంలో పెళ్ళి చేస్కోవడం. తను ఒంటరిగా ఉండాలని ఉంటున్నాడే తప్ప ఆ అమ్మాయిలో తప్పులేదు. పెళ్ళి విషయంలో తొందరపడ్డాడనే సంగతి అందరికీ తెలిసిందే కదా! కానీ... కూతురిని, అమ్మని, తమ్ముడిని అందరినీ అన్నివిధాలా బాగా చూస్కుంటాడు.
చిన్నప్పటి నుండి సినిమాలేనా? ఇంక దేనిమీదా ఆసక్తి లేదా?
సినిమాలు, పుస్తకాలు, సత్యేంద్ర సావాసం కూడా ఇష్టం. అతను ‘‘నా యిష్టం’’లో రాసినట్టు అందరూ దోమలని చంపితే, రాము దోమలని సున్నితంగా తరిమేవాడు! అటువంటి మనసు రాముది!
మరి మీ చేతిలో దెబ్బలు తిన్నారా?
చాలాసార్లు. కానీ పన్నెండేళ్లప్పుడు ఓసారి నాతో అన్నాడు... ‘‘నాకు తెలుసు అమ్మా - నీకు వేరే వొత్తిడి ఉండటం వల్ల కోపం వస్తోంది కానీ నా మీద కాదు’’ అని. ఆ వయసులోనే వాడికంత అవగాహన ఉండేది.
ఇప్పటి రాంగోపాల్ వర్మపై మీ అభిప్రాయం?
హిమాలయాల్లో ఉండవలసిన యోగి మన మధ్య వచ్చి చిక్కుకుపోయాడు అనిపిస్తోంది. తప్పిపోయి వచ్చాడో, ఇష్టంగా వచ్చాడో తెలియదు కానీ, వచ్చాడు. అందరినీ, జీవితాన్నీ బాగా అర్థం చేసుకున్నాడు. విడిపోయిన తరువాత కూడా తన కూతురికి కావలసినవి చూస్కున్నాడు. భార్యని ఎప్పుడూ సూటిపోటి మాటలు అనలేదు.
ఇప్పుడేమైనా మీ అబ్బాయి మీతో లేనిలోటు ఫీలౌతారా?
తను టైంకి తిని నిద్రపోతే చాలు అనుకుంటాను. ఎందుకంటే తను నాతో ఉండేది కొన్ని నిమిషాలే అయినా మనస్ఫూర్తిగా ఉంటాడు కనుక. తనవల్ల చాలా మందికి మేలు జరుగుతోంది కదా!
మీ కొడుకు కోసం అమ్మగా మీ ఆశయం?
రాముకి మంచి జరగాలి అనడంకంటే, నిర్మాతలకి మేలు జరగాలని కోరుకుంటాను.
మీకిష్టమైన వర్మ సినిమా?
26/11. ఆ సన్నివేశాలు, హోటల్ సీన్, స్టేషన్ చూసి ఎంతబాగా తీశాడో అని మురిసిపోతుంటాను. ఏమో అమ్మని కాబట్టి అంత
నచ్చిందా? పోనీ నువ్వు చెప్పు... (చిరునవ్వు) అవును... చాలా అద్భుతమైన స్క్రీన్‌ప్లే!!
హిమాలయాల్లో ఉండవలసిన యోగి మన మధ్య వచ్చి చిక్కుకు పోయాడు అనిపిస్తోంది. తప్పిపోయి వచ్చాడో, ఇష్టంగా వచ్చాడో తెలియదు కానీ, వచ్చాడు. అందరినీ, జీవితాన్నీ బాగా అర్థం చేసుకున్నాడు.