సాక్షి, హైదరాబాద్: పౌరహక్కుల నేత, జైలులో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తల్లి గోకరకొండ సూర్యావతి(75) శనివారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చిన్న కుమారుడు రాందేవ్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్య, విరసం సభ్యులు రాము, అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధి భవానీ తదితరులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన సాయిబాబా ఉ.పా. చట్టం కింద నాగ్‌పూర్ సెంట్రల్ జైల్‌లో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యావతి కూతురు భవానీ మావోయిస్టు పార్టీలో పనిచేసి 20 ఏళ్ల క్రితమే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. కేన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చివరిసారిగా చూసేందుకు అవకాశం ఇవ్వాలని సాయిబాబా ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. పెరోల్‌గానీ, బెయిల్ గానీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయినా ఆయనకు ఆ అవకాశం లభించలేదు. 90 శాతం వైకల్యం, అనారోగ్యంతో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న తన కొడుకును కూడా ఆమె చివరిసారిగా చూసుకోలేకపోయారు.
ఎదురుచూపులే మిగిలాయి....
సూర్యావతి కుటుంబం మొదటి నుంచి ప్రజాఉద్యమాలకే అంకితమైంది. ఆమె బిడ్డలందరూ ప్రజాసంఘాలోన్లే పనిచేసేవారు. బిడ్డ మావోయిస్టు పార్టీలో పనిచేసినంత కాలం ఆమె రాక కోసం సూర్యావతి ఎదురు చూసేవారు. చివరకు ఆ కూతురు విగతజీవిగానే ఇల్లు చేరింది. కొడుకు విడుదల కోసం చివరి క్షణం వరకు ఆమె ఎదురుచూస్తూనే ఉండిపోయారు. ఎన్నో నిద్రలేనిరాత్రులు గడిపిన ఆ తల్లి చివరకు కేన్సర్ బారిన పడ్డారు. మరోవైపు జైల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న సాయిబాబా తన తల్లికి కేన్సర్ అని తెలిసి తల్లడిల్లిపోయారు. ఒక్కసారైనా అమ్మను చూడాలని ఎంతో ఆరాటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment