Suthariguda Toll Plaza
-
టోల్‌ప్లాజా వద్ద భద్రత చర్యలకు శ్రీకారం
మేడ్చల్: మండల పరిధిలోని సుతారిగూడ టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందడంతో హెచ్ఎండీఏ అధికారులు నివారణ చర్యలకు ఉపక్రమించారు. టోల్‌ప్లాజా ఉన్నట్లు దూరం నుంచే రాత్రి సమయంలో తెలిసేవిధంగా రోడ్డుపై రేడియం లైట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. 100 మీటర్ల ముందు నుంచి వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేందుకు గురువారం హెచ్ఎండీఏ సిబ్బంది కొలతలు తీసుకొని పనులు ప్రారంభించారు. మంగళవారం జరిగిన ప్రమాదానికి రింగురోడ్డుపై దారిమళ్లింపు, టోల్‌ప్లాజా ఉన్నట్లు సూచిక బోర్డులు లేకపోవడం, వేగ నిరోధకాలు లేకపోవడమే కారణమని తెలిసిందే. దీంతో హెచ్ఎండీఏ అధికారులు ఇకపై ప్రమాదాలు చోటుచేసుకోకుండా నివారణ చర్యలు చేపట్టింది. -
‘ఔటర్’పై మూడో ప్రమాదం
లారీని ఢీకొన్న మరో లారీ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మేడ్చల్: మండల పరిధిలోని సుతారిగూడ టోల్‌ప్లాజా సమీపంలో వరుసగా మూడో రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. రింగురోడ్డుపై భద్రతా సౌకర్యాలు లేక మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన విదితమే. కాగా, బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షం కారణంగా రింగురోడ్డుపై నీరు నిల్వడంతో మధ్యాహ్నం శంషాబాద్ నుంచి వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన విషయం తెలిసిందే. అయితే, అదేరోజు రాత్రి మరో ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి శంషాబాద్ నుంచి వస్తున్న లారీ టోల్‌ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వేగనిరోధకాలకు రేడియం లైటింగ్ లేకపోవడంతో లారీ డ్రైవర్‌కు స్పీడ్‌బ్రేకర్లు కనిపించలేదు. దీంతో ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. రెండు లారీలు నెమ్మదిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన లారీ ముందు భాగం ధ్వంసమైంది.