suven
-
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. -
యాడ్వెంట్ చేతికి సువెన్ ఫార్మా
ముంబై: దేశీ హెల్త్‌కేర్ కంపెనీ సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో మెజారిటీ వాటాను గ్లోబల్ పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకోనుంది. ప్రమోటర్లు జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాడ్వెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రమోటర్ల నుంచి 12.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ రూ. 6,313 కోట్లు వెచ్చించనున్నట్లు సువెన్ బీఎస్ఈకి తెలియజేసింది. దీనిలో భాగంగా సువెన్ వాటాదారులకు యాడ్వెంట్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. షేరుకి రూ. 495 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి పబ్లిక్ నుంచి 6,61,86,889 షేర్ల కోసం యాడ్వెంట్ రూ. 3,276 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం సువెన్‌లో జాస్తి కుటుంబీకులకు మొత్తం 60 శాతం వాటా ఉంది. తాజా డీల్‌తో ఈ వాటా 9.9 శాతానికి పరిమితంకానుంది. విలీనానికి ఆసక్తి పోర్ట్‌ఫోలియో కంపెనీ కోహేన్స్‌ను సువెన్‌లో విలీనం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు యాడ్వెంట్ పేర్కొంది. తద్వారా విలీనం సంస్థ ఎండ్ టు ఎండ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ దిగ్గజంగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు ఏఐపీ తయారీని సైతం కలిగి ఉన్న కంపెనీ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్ మార్కెట్లలో సర్వీసులందించనున్నట్లు వివరించింది. ఐదారు నెలల్లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు సువెన్ ఫార్మా ఎండీ జాస్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక అవకాశాలు, వాటాదారులకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాల ఆధారంగా విలీన అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు తెలియజేశారు. షేర్ల మార్పిడి తదితరాలపై కసరత్తు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా.. మిగిలిన 9.9% ప్రమోటర్ల వాటాను 18 నెలలపాటు విక్రయించకుండా లాకిన్ పిరియడ్ వర్తిస్తుందని జాస్తి చెప్పారు. వాటాదారులతోపాటు ఈ వాటాకు తగిన విలువ చేకూరే వరకూ విక్రయించే యోచన లేదని స్పష్టం చేశారు. 2020లో విభజన.. మాతృ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ నుంచి 2020లో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విడివడింది. గత నాలుగేళ్లలో ఆదాయం 20 శాతం స్థాయిలో వృద్ధి చూపింది. 43 శాతానికి మించిన నిర్వహణ లాభ మార్జిన్లు సాధిస్తోంది. ఇక 2021–22లో కోహేన్స్ రూ. 1,280 కోట్ల టర్నోవర్ అందుకుంది. 2007 నుంచీ దేశీయంగా దృష్టి పెట్టిన యాడ్వెంట్ విభిన్న రంగాలకు చెందిన 14 కంపెనీలలో 3.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో సువెన్ ఫార్మా షేరు దాదాపు 5% పతనమై రూ. 473 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 520–470 మధ్య ఊగిసలాడింది. ముఖ్య సలహాదారుగా.. డీల్ పూర్తయ్యాక కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు జాస్తి తెలియజేశారు. అయితే ప్రధాన సలహాదారుగా కన్సల్టెన్సీ సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించారు. హెల్త్‌కేర్‌లో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగా వృత్తి నిపుణులుగల యాడ్వెంట్ తమకు అనుగుణమైన కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. తద్వారా సువెన్ తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోహెన్స్‌తో విలీనం ద్వారా విభిన్న సర్వీసులు సమకూర్చగలుగుతామని, ఇది రెండు సంస్థలకూ లబ్ధిని చేకూర్చుతుందని వివరించారు. సువెన్ కొనుగోలు ద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,600 కోట్లు) విలువైన గ్లోబల్ కంపెనీకి తెరతీసే వీలున్నట్లు యాడ్వెంట్ ఎండీ పంకజ్ పట్వారీ పేర్కొన్నారు. సువెన్ సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సీడీఎంవో విభాగంలోని గ్లోబల్ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. -
అమ్మకానికి సువెన్ ఫార్మా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ అమ్మకం లేదా మెజారిటీ వాటా విక్రయానికి సువెన్ ఫార్మాస్యూటికల్స్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మెజారిటీ వాటా అమ్మకం విషయమై సలహా కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ను నియమించు కున్నట్టు తెలుస్తోంది. కంపెనీని విక్రయించేందుకు ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉంది. డీల్ ద్వారా వచ్చే మొత్తాన్ని సువెన్ లైఫ్ సైన్సెస్‌లో ఔషధాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు సువెన్ ఫార్మా నుంచి డివిడెండ్ రూపంలో సమకూరిన మొత్తాన్ని ప్రమోటర్లు ఇందుకోసం వ్యయం చేశారు. సువెన్ లైఫ్ నుంచి 2020లో సువెన్ ఫార్మా విడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే సువెన్ ఫార్మాస్యూటికల్స్ షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.52 శాతం ఎగసి రూ.491.10 వద్ద స్థిరపడింది. -
సువెన్ చేతికి రైజింగ్ ఫార్మా ఆస్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ సువెన్ లైఫ్ సైన్సెస్... యూఎస్ సంస్థ ఎసిటో కార్పొరేషన్‌కు చెందిన రైజింగ్ ఫార్మాస్యూటికల్స్‌తోపాటు అనుబంధ కంపెనీల ఆస్తులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.105 కోట్లు చెల్లించేందుకు సువెన్ అంగీకరించిందని ఎసిటో వెల్లడించింది. ఎసిటో దివాలా తీయడంతో కోర్టు ఆమోదించిన బిడ్డింగ్ విధానంలో ఆస్తులను విక్రయిస్తోంది. సువెన్ లైఫ్ జేవీ అయిన షోర్ సువెన్ ఫార్మా ద్వారా ఈ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ ద్వారా యూఎస్‌లో షోర్ సువెన్ పటిష్టమైన జనరిక్ ఫార్మా కంపెనీగా మారుతుందని సువెన్ లైఫ్ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు. -
‘సువెన్’ సేవలు అభినందనీయం
సూర్యాపేటరూరల్ : సమాజ అభివృద్ధికి సువెన్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం సువెన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీలో ఏర్పాటు చేసిన శాంతినగర్, కేసారం, దురాజ్‌పల్లి, ఖాసీంపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బెంచీలు, నోట్‌బుక్స్ షూ, సాక్స్, టై, బెల్ట్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనూ కంపెనీ భాగస్వామ్యం కావాలని, మొక్కలను నాటడమే కాకుండా..వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సువెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షల విలువైన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట తహసీల్దార్ మహమూద్‌అలీ, ఎంఈఓ గ్లోరి, సర్పంచ్ బాలిని పద్మ, లింగస్వామి, ఎంపీటీసీ సూర సంధ్య, వెంకన్న, సువెన్ యూనిట్ హెడ్ వి.ఎస్ఎన్ మూర్తి, డీజీఎం బి.లక్ష్మణమూర్తి, ఏజీఎంలు సి.హెచ్ వీరయ్య, ఎం.కృష్ణారావు, పి.జగపతిరాయుడు, చంద్రహాస, రసూల్మదీన, ఎం.వెంకటరమణ, మేనేజర్లు డి.సుధాకర్, డి.వి శేషగిరిరావు, పి.వెంకటరమణ, పీఆర్ఓ బూర రాములుగౌడ్, పాఠశాలల హెచ్ఎంలు సురేష్, కట్కూరి రవీందర్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, నీరజ, మంగతాయారు పాల్గొన్నారు.