Svarnaratham
-
ప్రయోగాత్మకంగా స్వర్ణ రథ పరిశీలన
తిరుమల: తిరుమలలో సోమవారం శ్రీవారి స్వర్ణరథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించి పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ మండపం నుంచి రథాన్ని వెలుపలకు తీసారు. ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు లాగారు. ఎస్ఈ రమేష్‌రెడ్డి, ఈఈలు జీవీ కృష్ణారెడ్డి, నరసింహమూర్తి, ఏఈ దేవరాజులు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సీఎండీ ప్రసాదరావు, ఇతర ఇంజనీరింగ్ నిపుణులు .. రథం పనితీరును పరిశీలించారు. రథచక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో చూశారు. మలుపుల వద్ద ఎంత దూరంలో ఉన్నప్పుడు ముందుజాగ్రత్తలు తీసుకునే విషయంపై అధ్యయనం చేశారు. శ్రీవారి చక్రస్నానం తిరుమలలో సోమవారం శ్రీవారి చక్రస్నానం నిర్వహించారు.ఏటా భాద్రపద మాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య చక్రస్నానం నిర్వహించారు. -
గరుడవాహనంపై శ్రీవారి పట్టపురాణి
తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు బుధవారం రాత్రి అమ్మవారికి అత్యంత వేడుకగా గరుడసేవ జరిగింది. గరుత్మంతునిపై శ్రీవారి పట్టపురాణి అలమేలుమంగమ్మ తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా అమ్మవారిని సుప్రభాతం తో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల కు అమ్మవారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణుని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరి గింది. సాయంత్రం 5 గంటలకు దివ్య తేజోమయి అయిన అలమేలుమంగమ్మ స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7 గంటలకు ఆస్థానమండపంలో అమ్మవారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చారు. శ్రీవారి పాదాలను తొడిగి గరుత్మంతునిపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య మణిమాణిక్యాలు, శ్రీవారి సహస్ర లక్ష్మీ కాసులహారంతో సర్వాంగసుందరంగా అలంకరించారు. రాత్రి 8.30 గంటలకు జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం, భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, వేదగోష్టి నడుమ అమ్మవారు గరుత్మంతునిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. -
శ్రీవారి కొత్త స్వర్ణరథం పరిశీలనలో.. అడుగడుగునా అవాంతరమే!
సాక్షి, తిరుమల : దేశంలోనే అతిపెద్దదైన శ్రీవారి కొత్త స్వర్ణరథం ప్రయోగాత్మక పరిశీలనలో అడుగడుగునా అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. తారు రోడ్డు, డ్రైనేజీ పైపులైను వద్ద నాలుగుసార్లు రథం చక్రాలు దిగబడ్డాయి. రథం లాగే డెరైక్షన్ ఇనుపరాడ్డు విరిగింది. లాగేందుకు వాడే మోకుతాడు తెగింది. రథం తయారీలో శాస్త్రీయంగా కచ్చితమైన నిబంధనలు పాటించకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని నిపుణులు అంచనా వేశారు. అధిక బరువు, చాసీస్లో సాంకేతిక సమస్యలే కారణం పాత స్వర్ణరథం బరువు 15 టన్నులలోపే ఉండేది. 32 అడుగుల ఎత్తు కలిగిన కొత్త స్వర్ణరథం బరువు 30 టన్నులు. రథం కింది భాగం చాసీస్, చక్రాలు అన్నీ కూడా భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) సంస్థ నిర్ణయించిన మేరకే తయారు చేసింది. అయితే, అవసరానికి మించి బరువుతో కొత్త రథాన్ని సిద్ధం చేశారు. ఈ బరువుకు అనుగుణంగా చాసీస్, చక్రాల అలైన్మెంట్ చేయలేకపోయారు. రథాన్ని లాగేందుకు వినియోగించిన డెరైక్షన్ రాడ్(కమ్మీ) పెళుసుగా ఉండడంతో విరిగిపోయింది. బరువులో వ్యత్యాసం, చక్రాలు వెడల్పు లేకపోవడం, అలైన్మెంట్ సరిచూసుకోకపోవడంతో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డారుు. తారురోడ్డు, డ్రైనేజీ పైపులను గుర్తించ లేకపోయారు. దీనివల్ల నాలుగు చోట్ల రథం చక్రాలు భూమిలోకి దిగబడిపోయాయి. ఎక్కడికక్కడ క్రేన్లు, పొక్లైనర్లు వినియోగించాల్సి వచ్చింది. 200 మీటర్లు దాటించేందుకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రమించాల్సి వచ్చింది. అర్ధరాత్రి వరకు కూడా రథాన్ని రథ మండపంలోకి చేర్చలేకపోయారు. టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్, చీఫ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి, బీహెచ్ఈఎల్ నిపుణులు రథం ఊరేగింపును పర్యవేక్షించారు. సమస్యలను అధిగమించి ఈ నెల 10న ఊరేగిస్తామని టీటీడీ తిరుమల జేఈవో తెలిపారు. కానీ, 3వ తేదీన మరోసారి ప్రయోగాత్మకంగా పరిశీలనలోనూ పరిస్థితి ఇలాగే ఉంటే 10వ తేదీన జరిగే పాత స్వర్ణరథానికే మెరుగులు దిద్ది స్వామివారిని ఊరేగించే అవకాశం ఉంది.