శ్రీవారి కొత్త స్వర్ణరథం పరిశీలనలో.. అడుగడుగునా అవాంతరమే!
సాక్షి, తిరుమల : దేశంలోనే అతిపెద్దదైన శ్రీవారి కొత్త స్వర్ణరథం ప్రయోగాత్మక పరిశీలనలో అడుగడుగునా అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. తారు రోడ్డు, డ్రైనేజీ పైపులైను వద్ద నాలుగుసార్లు రథం చక్రాలు దిగబడ్డాయి. రథం లాగే డెరైక్షన్ ఇనుపరాడ్డు విరిగింది. లాగేందుకు వాడే మోకుతాడు తెగింది. రథం తయారీలో శాస్త్రీయంగా కచ్చితమైన నిబంధనలు పాటించకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని నిపుణులు అంచనా వేశారు.
అధిక బరువు, చాసీస్‌లో సాంకేతిక సమస్యలే కారణం
పాత స్వర్ణరథం బరువు 15 టన్నులలోపే ఉండేది. 32 అడుగుల ఎత్తు కలిగిన కొత్త స్వర్ణరథం బరువు 30 టన్నులు. రథం కింది భాగం చాసీస్, చక్రాలు అన్నీ కూడా భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) సంస్థ నిర్ణయించిన మేరకే తయారు చేసింది. అయితే, అవసరానికి మించి బరువుతో కొత్త రథాన్ని సిద్ధం చేశారు. ఈ బరువుకు అనుగుణంగా చాసీస్, చక్రాల అలైన్‌మెంట్ చేయలేకపోయారు. రథాన్ని లాగేందుకు వినియోగించిన డెరైక్షన్ రాడ్(కమ్మీ) పెళుసుగా ఉండడంతో విరిగిపోయింది. బరువులో వ్యత్యాసం, చక్రాలు వెడల్పు లేకపోవడం, అలైన్‌మెంట్ సరిచూసుకోకపోవడంతో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డారుు. తారురోడ్డు, డ్రైనేజీ పైపులను గుర్తించ లేకపోయారు. దీనివల్ల నాలుగు చోట్ల రథం చక్రాలు భూమిలోకి దిగబడిపోయాయి.
ఎక్కడికక్కడ క్రేన్లు, పొక్లైనర్‌లు వినియోగించాల్సి వచ్చింది. 200 మీటర్లు దాటించేందుకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రమించాల్సి వచ్చింది. అర్ధరాత్రి వరకు కూడా రథాన్ని రథ మండపంలోకి చేర్చలేకపోయారు. టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో జీవీజీ అశోక్‌కుమార్, చీఫ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి, బీహెచ్‌ఈఎల్ నిపుణులు రథం ఊరేగింపును పర్యవేక్షించారు. సమస్యలను అధిగమించి ఈ నెల 10న ఊరేగిస్తామని టీటీడీ తిరుమల జేఈవో తెలిపారు. కానీ, 3వ తేదీన మరోసారి ప్రయోగాత్మకంగా పరిశీలనలోనూ పరిస్థితి ఇలాగే ఉంటే 10వ తేదీన జరిగే పాత స్వర్ణరథానికే మెరుగులు దిద్ది స్వామివారిని ఊరేగించే అవకాశం ఉంది.