తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు బుధవారం రాత్రి అమ్మవారికి అత్యంత వేడుకగా గరుడసేవ జరిగింది. గరుత్మంతునిపై శ్రీవారి పట్టపురాణి అలమేలుమంగమ్మ తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా అమ్మవారిని సుప్రభాతం తో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల కు అమ్మవారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణుని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు.
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరి గింది. సాయంత్రం 5 గంటలకు దివ్య తేజోమయి అయిన అలమేలుమంగమ్మ స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7 గంటలకు ఆస్థానమండపంలో అమ్మవారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చారు. శ్రీవారి పాదాలను తొడిగి గరుత్మంతునిపై కొలువుదీర్చారు.
పట్టుపీతాంబర వజ్రవైఢూర్య మణిమాణిక్యాలు, శ్రీవారి సహస్ర లక్ష్మీ కాసులహారంతో సర్వాంగసుందరంగా అలంకరించారు. రాత్రి 8.30 గంటలకు జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం, భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, వేదగోష్టి నడుమ అమ్మవారు గరుత్మంతునిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
గరుడవాహనంపై శ్రీవారి పట్టపురాణి
Published Thu, Dec 5 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement