మా ఇంట్లో టాయిలెట్ ఉంది సార్!
గుజరాత్‌లోని ఓ జిల్లాలోని స్కూళ్లలో పిల్లవాడికి ఆ రోజు అటెండెన్స్ వేయాలంటే అతను మాష్టారు పిలిచినప్పుడు చెప్పాల్సింది 'ప్రెజెంట్ సార్' అని కాదు.. మా ఇంట్లో టాయిలెట్ ఉంది సార్! అని. ఇదేంటి అనుకుంటున్నారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌కు అనుగుణంగా పనిచేస్తున్న స్వచ్ఛభారత్ అభియాన్ కింద గుజరాత్ లోని నర్మదా జిల్లాలో గల ప్రాథమిక పాఠశాలల్లో ఇలా పలికితేనే అటెండెన్స్ వేస్తారు.
ప్రతి విద్యార్ధికి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే అవగాహన కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి విద్యాశాఖ అధికారులు తెలిపారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో దాదాపు 690 ప్రాథమిక పాఠశాలు ఉన్నాయి. వీటిలో చదువుకునే పిల్లలంతా హాజరు చెప్పేటప్పుడు ‘మా ఇంట్లో టాయిలెట్ ఉంది సార్!’ అని చెప్పాల్సిందేనని రూల్ పాస్ చేసినట్లు వివరించారు. దీంతో మిగతా విద్యార్థుల ముందు టాయిలెట్ లేదని చెప్పిన విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత మరుగుదొడ్డి ఏర్పాటుపై తల్లిదండ్రులతో చర్చించి టాయిలెట్లను నిర్మించుకుంటున్నట్లు తెలిపారు.
ఇది మొదటి దశలో జరిగిందని, రెండో దశలో ఇంకా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టని తమ తరగతి మిత్రుల ఇంటికి పిల్లలందరూ కలిసి వెళ్లి టాయిలెట్ నిర్మాణంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ విషయంపై ఓ విద్యార్ధిని పలకరించగా.. తన పేరు నిరవ్ బరియా అని కెవాడియాలోని కెవాడియా కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. పాఠశాలలో హాజరు చెప్పే పద్ధతిలో మార్పు చేసినప్పుడు తన ఇంట్లో టాయిలెట్ లేదని చెప్పాడు. దీంతో మిగిలిన స్నేహితుల ముందు టాయిలెట్ లేదని చెప్పాల్సి వచ్చిందని తెలిపాడు. సాయంత్రం ఇంటికి వెళ్లాక ఈ విషయంపై ఇంట్లో మాట్లాడానని, వెంటనే వాళ్లు మరుగుదొడ్డి నిర్మాణానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించాడు.