swachh telangana
-
స్వచ్ఛంగా.. అచ్చంగా.. మూడోసారి
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది. వరుసగా మూడోసారి ఈ అవార్డును దక్కించుకుని సరి కొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో మూడో స్థానం లో నిలిచింది. ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీలవారీగా అవార్డులు అందజేస్తోంది. రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో పనితీరును మదింపు చేసి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తోంది. స్వచ్ఛ సుందర్ సముదాయిక్ సౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్), సముదాయిక్ సౌచాలయ అభియాన్ (ఎస్ఎస్ఎ) చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డీడీడబ్ల్యూఎస్) కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణను స్వఛ్చభారత్ అవార్డుకు ఎంపిక చేసినట్లు గందగీ ముక్త్ భారత్ డైరెక్టర్ యుగల్ జోషి తెలిపారు. అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను అందజేయనున్నారు. కాగా, స్వచ్ఛభారత్ అవార్డును వరుసగా మూడో సారి దక్కించుకోవడంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. -
అన్ని బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమం
గోల్నాక (హైదరాబాద్) : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమాన్ని విద్యార్థుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కె.అలోక్‌కుమార్ అన్నారు. సోమవారం అంబర్‌పేటలోని బీసీ కళాశాల హాస్టల్లో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలోని పది జిల్లాల్లో 250 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, ఆయా కళాశాలల్లో విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి వారికి వీలైన సమయంలో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. బీసీ సంక్షేమశాఖ ఉద్యోగులు, విద్యార్థులంతా ఇందులో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
సినీ నటుల సేవలు వాడుకుంటాం: కేసీఆర్
హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. రూ.1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగరాన్ని 400 వందలు విభాగాలుగా విభజించి ఇంఛార్జ్ లను నియమించి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. నగర అభివృద్ధి, పరిశుభ్రతలో పౌరులందరి భాగస్వామ్యం కావాలన్నారు. ఇందుకోసం సినీ నటులు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖుల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు. మే 6న స్వచ్ఛ హైదరాబాద్ అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మే 16న గవర్నర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు.