స్వాగత్ హోటల్‌పై ఓయూ విద్యార్థుల దాడి
హైదరాబాద్: తమ విశ్వవిద్యాలయ భూములను కబ్జా చేసి అందులో అక్రమ కట్టడాలు కట్టినవారు వెంటనే ఖాళీ చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు డిమాండ్ చేశారు. హబ్సీగూడాలోని స్వాగత్ హోటల్‌పై వారు సోమవారం దాడికి దిగారు. విశ్వవిద్యాలయ భూముల్లో హోటల్ నిర్మించారని, వెంటనే దానిని తొలగించాలని నినాదాలు చేస్తూ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని, అంగుళం ఆక్రమించినా క్షమించబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఉస్మానియాపై ఎవరు కన్నేసినా క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తెలంగాణ విద్యార్థి విభాగం (టీవీవీ)వంటి కొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ దాడి చేశారు. కాగా, ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే వచ్చి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిరువురి మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. అనంతరం పలువురు విద్యార్థి నాయకులను విద్యార్థులను అదుపులోకి తీసుకొని వ్యాన్‌లో తీసుకెళ్లారు. ఉస్మానియా భూముల్లో పేదవారికి ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు అని ప్రకటన చేసినప్పటి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల్లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు