సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే!
‘‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న యువకులు వంద మందిని నాకు ఇస్తే, ఈ దేశాన్నే మార్చేస్తాను!’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి మొత్తం యువతీ యువకుల చేతుల్లోనే ఉందని నూరేళ్ళ క్రితమే గుర్తించి, ఆ సంగతిని అప్పుడే బాహాటంగా చాటిన దార్శనికత ఆయనది. నేడు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి జ్ఞానదానందతో సాక్షి సంభాషణ...
- స్వామి జ్ఞానదానంద, ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు
దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా నుంచి స్వామి వివేకానంద తన సోదర శిష్యులకు ఉత్తరం రాస్తూ, ‘‘కిన్నామ రోదసి... న జడః కదాచిత్॥అని పేర్కొన్నారు. అంటే, ‘ఓ మిత్రమా! నువ్వెందుకు విలపిస్తున్నావు? సమస్త శక్తీ నీలోనే ఉంది. ఓ శక్తిశాలీ! నీ సర్వశక్తి స్వభావాన్ని వెలికి తీసుకురా! ఈ లోకం సమస్తం నీకు పాదాక్రాంతమవుతుంది’ అని! ముఖ్యంగా, యువతరం ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. దేనికీ దిగాలుపడకుండా, నిరాశలో కూరుకుపోకుండా మనలోని దైవిక స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. మనం సామాన్యులం కాదనే స్పృహతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు.
ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలను‘నువ్వెందుకూ పనికిరావు. శుద్ధదండగ... ‘నువ్వు పాపివి! నిష్ర్పయోజకుడివి’ అని పదే పదే అనడం వల్ల చివరకు వారు అలానే తయారవుతారు. అలా కాకుండా, సానుకూల దృక్పథంతో ప్రోత్సహిస్తే - పైకి వస్తారు! యువతరం ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంది. కమ్ముకున్న తెరలను చీల్చుకొని, నిద్రావస్థ నుంచి వాళ్ళు మేల్కొనాలి. తమలోని శక్తిని గ్రహించి, తమ లోపలే ఉన్న ఆ మహాపురుషుణ్ణి దర్శించాలి. అలా తమ అసలు సిసలు ఆత్మ స్వభావాన్ని గ్రహించి, తమ ఔన్నత్యాన్ని తెలుసుకుంటే చాలు - అన్నిటా విజయం వరిస్తుంది. ‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!’ అని స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేసింది అందుకే!
మన ఆత్మస్వభావం తెలుసుకోకపోతే - ఎలా తయారవుతామనడానికి ఒక కథ ఉంది. అనగనగా ఒక గొర్రెల కాపరి. ఒకసారి నిండు గర్భిణి అయిన ఒక ఆడసింహం అతని గొర్రెల మంద మీద పడింది. ఆ గందరగోళంలో ఆ సింహం మరొక సింహం పిల్లకు జన్మనిచ్చి, మరణించింది. గొర్రెల కాపరి దగ్గర, ఆ మందలో ఒక గొర్రెపిల్లగా, గడ్డి తింటూ, గొర్రెస్వభావంతో పెరిగిందా - గొర్రెసింహం. తీరా ఒకసారి ఒక సింహం దాడికి వచ్చినప్పుడు, గొర్రెల్లో ఒకదానిలా భయపడిపోతున్న ఈ గొర్రెసింహాన్ని చూసి, తీసుకెళ్ళి, బావిలోని నీటిలో ప్రతిబింబం చూపి, దాని స్వభావాన్ని ఎరుకపరిచింది. అప్పటి నుంచి ఆ పిల్ల సింహం మరుగునపడ్డ తన స్వభావాన్ని గ్రహించి, గర్జన చేసింది. ఈ కథలో ఈ పిల్ల సింహం మనమైతే, మనకు మన నిజ స్వభావాన్ని తెలియజెప్పే పెద్ద సింహం - స్వామి వివేకానంద. ఇవాళ్టికీ స్వామీజీ బోధనల్ని చదివి, తమకు తాము బోధించుకొని, ఆచరణలో పెడితే యువకులు సింహాలై గర్జిస్తారు. వారి వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోతుంది.
దురదృష్టవశాత్తూ ఇవాళ్టి సమాజంలో జనం తమలో దైవత్వం ఉందనీ, తాము అమృతపుత్రులమనీ విస్మరిస్తున్నారు. సమస్యలొస్తే - దైర్యంగా ఎదుర్కోవడం లేదు. దూరంగా పారిపోతున్నారు. తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. కానీ, దాని వల్ల లాభం లేదు. పారిపోయే కొద్దీ సమస్యలు ఇంకా బలపోతమవుతాయి. వెంటాడతాయి. వేధిస్తాయి. మనం బలహీనమైపోతాం. అలాకాక, ధైర్యంగా ఎదుర్కొంటే, సమస్యలు బలహీనమై, పారిపోతాయి. అదే అసలు కిటుకు!
చదువంటే మార్కులు, ర్యాంకుల పంటలే కాదు... మనిషి శీల నిర్మాణ విద్య. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ మనిషిలో మానసిక బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, నిర్భీతినీ పెంపొందించాలి. అలాంటివి బోధించడానికే, రామకృష్ణ మఠం శాఖలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ శాఖలో ఏటా దేశం నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులతో ‘యువజన సమ్మేళనం’ జరుపుతున్నాం. అలాగే, ‘హౌ టు ఓవర్‌కమ్ టెన్షన్ అండ్ వర్రీ’, ‘హౌ టు ఓవర్‌కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ లాంటి అంశాలపై తరచూ క్లాసులు, సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాం. వాటివల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడడం స్వయంగా చూస్తున్నాం.
ఒక్కముక్కలో చెప్పాలంటే - స్వామీజీ ఆ రోజుల్లోనే అన్నట్లు - యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది ఉంటే చాలు - మిగిలినవన్నీ జీవితంలో సాధించుకోగలుగుతారు. మరి, అలా మన మీద మనకు నమ్మకం కలిగించే బోధనలంటే - ఈ తరానికి స్వామి వివేకానంద బోధనల వినా మరో మార్గం లేదు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా జరుపుకొనే ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు మరోసారి ఆయన మాటలను పునశ్చరణ చేసుకుందాం. ఆ మాటలను ఆచరణలో పెట్టి, నవ భారత నిర్మాణానికి నడుం కడదాం!! సర్వం శ్రీ రామకృష్ణార్పణమస్తు
- రెంటాల జయదేవ