‘స్వయమ్’లో 2 వేల ఆన్లైన్ కోర్సులు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా ‘స్వయమ్’పోర్టల్ ద్వారా 2వేల ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెడతామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో వారం పాటు జరగనున్న టీచర్ల వర్క్‌షాప్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన స్వయమ్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం 380 కోర్సులకు తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. వీటి ద్వారా దాదాపు 60 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారని చెప్పారు.
ఏటీఎం లాగా ఇది విద్యార్థులకు మరో ఏటీఎల్(ఎనీ టైమ్ లెర్నింగ్) అని అన్నారు. ఈ వర్క్‌షాప్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి తరగతులు నిర్వహిస్తారు. విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది స్వయమ్ పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా పాఠశాల స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులను ఆన్లైన్లో నేర్చుకోవచ్చు.