ఎదురీతలో మొనగాళ్లు.. శుక్రకణాలే!
నదీ ప్రవాహానికి ఎదురీదడం చాలా కష్టం కదూ. కానీ, అలా ఎదురీదడంలో శుక్రకణాలు చాలా ముందంజలో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృత్రిమ గర్భోత్పత్తిలో ఉపయోగించే వాటికన్నా కూడా సాధారణ శుక్రకణాలే వేగంగా ఈదుతాయని తేల్చి చెప్పారు. సరైన ప్రవాహ వేగాన్ని సృష్టించగలిగితే, శుక్రకణాలు చాలా నిమిషాల పాటు ఎదురీత చేయగలవని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కల అసిస్టెంట్ ప్రొఫెసర్ జార్న్ డంకెల్ తెలిపారు.
లక్షలాది శుక్రకణాల్లో చాలా తక్కువ మాత్రమే సరిగా ఈదలేవని, అవి తమ గమ్యాన్ని కూడా సరిగా చేరుకోలేవని వివరించారు. ఇవి సరైన దిశలో ఈదడమే కాక, తమ పొడవు కంటే వెయ్యిరెట్లు ఎక్కువ దూరం వరకు కూడా వెళ్లగలవు. అవి వెళ్లే మార్గంలో రకరకాల రసాయనాలు, కెరటాలు ఎదురవుతాయి. శుక్రకణాల సామర్థ్యాన్ని అర్థం చేసుకోడానికి శాస్త్రవేత్తలు వివిధ పరిమాణాలు, ఆకారాల్లో ఉండే మైక్రో ఛానళ్లను ఏర్పాటుచేసి, వాటిలోకి వీటిని వదిలారు. వాటిలోకి ట్యూబుల ద్వారా ద్రవాలను వదిలి, శుక్రకణాలు వేర్వేరు కెరటాల వేగానికి ఎలా స్పందిస్తాయో చూశారు.