నకిలీ పుస్తకాలు ముద్రిస్తున్న ముఠా గుట్టురట్టు
ఇద్దరి అరెస్టు: రూ.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
కీలక నిందితుల కోసం ముంబైకి ప్రత్యేక బృందం
సాక్షి, సిటీబ్యూరో: కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి అంత ర్జాతీయ పుస్తకాలను ముద్రించి నగరం కేంద్రంగా దేశంలోని అన్ని పట్టణాలకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 6,500 పుస్తకాలతో పాటు ప్రింటింగ్ ప్రెస్‌ను సీజ్ చేశారు.
సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడకు చెందిన పుస్తకాల వ్యాపారి సయ్యద్ జకీర్ అలీ (42) అంతర్జాతీయ స్థాయిలో ఆయా పబ్లిషర్స్ ముద్రించిన పుస్తకాలను ఒకటి మాత్రమే ఖరీదు చేసేవాడు. ఈ బుక్‌ను కాపీ చేసి నల్లకుంటలోని సంపత్‌రెడ్డి ప్రింటింగ్ ప్రెస్‌లో వేలాది నకిలీ బుక్స్ ముద్రిస్తున్నాడు. అలా ముద్రించిన బుక్స్‌ను ముంబై తరలిస్తున్నాడు.
అక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం పసిగట్టిన కొన్ని పబ్లిషర్స్ సీసీఎస్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్. సత్యనారాయణరాజు జకీర్‌ను అదుపులోకి తీసుకుని వి చారించగా అధిక మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించానని నిందితుడు అంగీకరించాడు.
దీంతో జకీర్‌తో పాటు ప్రింటింగ్‌ప్రెస్ యజమాని సంపత్‌రెడ్డిని అరెస్టు చేశారు. వారి నుంచి 6.500 బుక్స్‌ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ప్రింటింగ్‌ప్రెస్‌ను సీజ్ చేశారు. ముంబైలోని గౌడాన్‌లో మరిన్ని బుక్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. ఈ కేసులో మరికొంత మంది కీలక వ్యక్తులను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏసీపీ జి.సుప్రజ, ఇన్స్పెక్టర్ చక్రపాణి పాల్గొన్నారు.