sylhet
-
ఫేస్బుక్ వీడియో వారి తండ్రిని కలిసేలా చేసింది
ఢాకా : ప్రస్తుతం సోషల్ మీడియా అనేది సమాజంలో మానవ సంబంధాలను దెబ్బతీస్తుందని ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నారు. కానీ అదే సోషల్ మీడియా 48 సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తిని తన వాళ్లకు దగ్గర చేసింది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ నగరానికి చెందిన హబీబుర్ రెహమాన్(78) అనే వ్యక్తి స్టీల్ వ్యాపారం నిర్వహించేవాడు. అతనికి భార్య , నలుగురు కుమారులు ఉన్నారు. అయితే 1972లో ట్రేడ్ వార్ ఉద్యమం ఉదృతంగా ఉండంతో వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాడు. దీంతో రెహమాన్ 30 సంవత్సరాల వయసులో వ్యాపార నిమిత్తం వేరే ప్రదేశానికి వెళుతున్నాని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగిరాలేదు. ఆ తర్వాత రెహమాన్ భార్య, ఆమె సోదరుడు కలిసి అతని గురించి వెతికే ప్రయత్నం చేశారు. రెహమాన్‌ను వెతికే ప్రయత్నం చేస్తుండగానే 2000 సంవత్సరంలో అతని భార్య మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి నలుగురు కుమారులు తండ్రి జాడ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రెహమాన్ పెద్ద కుమారుడు అమెరికాలో నివాసం ఉంటున్నాడు. జనవరి 17న రెహమాన్ పెద్ద కోడలు ఫేస్బుక్లో ఒక వీడియో చూసింది. ఆ వీడియోలో దీనావస్థలో ఉన్న వ్యక్తి తనకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలంటూ తన పక్కన ఉన్న మరో పేషెంట్‌ను అడుగుతున్నట్లు కనిపించింది. దీంతో అనుమానమొచ్చి ఆ వీడియోను తన భర్తకు చూపించింది. ఆ వీడియోలో తన తండ్రి హబీబుల్ రెహమాన్ కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే బంగ్లాదేశ్‌లో ఉంటున్న తన సోదరులైన షాహబుద్దీన్, జలాలుద్దీన్‌లకు ఫోన్ చేసి విషయం మొత్తం వివరించాడు. దీంతో వీడియో చూసిన వాళ్లు ఆ పేషేంట్ తమ తండ్రేనని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రెహమాన్ ఉన్న మాగ్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి వెళ్లి కలుసుకున్నారు. వారి తండ్రిని చూడగానే వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 25 సంత్సరాలుగా రెహమాన్ తమ దగ్గరే ఉంటున్నాడని మౌల్వీబజార్ జిల్లాకు చెందిన రజియా బేగం వెల్లడించారు. '1995లో హజరత్ షాహబుద్దీన్ ష్రైన్ సెంటర్ వద్ద రెహమాన్ మా కుటుంబసభ్యులకు దొరికాడు. అతను దొరికినప్పుడు అతని మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే అప్పుడు ఎలాంటి వివరాలు మాకు వెల్లడించలేదు. మా దగ్గర ఉంటున్నప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ అతన్ని మేము ఏం అడగకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్లం. ఒకరోజు హఠాత్తుగా మంచం మీద నుంచి కిందపడడంతో కుడిచేయి విరిగింది. దాంతో రెహమాన్‌ను మాగ్ ఉస్మానియా మెడికల్ ఆసుపత్రిలో జాయిన్ చేశామని' రజియా బేగం చెప్పుకొచ్చారు. రెహమాన్ పరిస్థితిని గమనించిన డాక్టర్లు అతను కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఇదే విషయమై రెహమాన్ మనవడు కెఫాయత్ అహ్మద్ స్పందిస్తూ.. నేను మళ్లీ మా తాతను చూస్తాననుకోలేదు. అతని కోసం మేం గాలించని ప్రదేశం లేదు. ఈరోజుకు మా కల నెరవేరిందని, మా తాతగారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. -
భారత్ బోణి
మహిళల టి20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‌పై గెలుపు సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. సిల్హెట్లో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మిథాలీ సేన 79 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 8 వికెట్లకు 72 పరుగులే చేసింది. రాణించిన హర్మన్‌ప్రీత్, మిథాలీ తొలి రెండు మ్యాచ్‌ల్లో చెత్త ఆటతో సెమీస్ రేసు నుంచి వైదొలిగిన భారత జట్టు, బంగ్లాతో మ్యాచ్‌లో సమష్టిగా ఆడింది. ఓపెనర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (59 బంతుల్లో 77; 12 ఫోర్లు, 1 సిక్సర్), మిథాలీ రాజ్ (38 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలో 107 పరుగులు జోడించారు. ఆ తర్వాత జులన్ గోస్వామి (3/11), శుభ్‌లక్ష్మి శర్మ (3/12), పూనమ్ యాదవ్ (2/10) ప్రత్యర్థి బ్యాట్స్‌ఉమెన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. -
జట్టు స్కోరు 95... మిథాలీ 57!
ఇంగ్లండ్ చేతిలో భారత మహిళలు చిత్తు సెమీస్ అవకాశాలు గల్లంతు! సిల్హెట్: మహిళల టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగింది. బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మిథాలీ బృందం పరాజయం పాలైంది. బుధవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగా...ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన టీమిండియా ఇక మిగిలిన రెండు లీగ్‌లు (వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో) నెగ్గినా సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమే! హైదరాబాదీ ఒంటరి పోరు... టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు సభ్యులలో కెప్టెన్ మిథాలీ రాజ్ (56 బంతుల్లో 57; 8 ఫోర్లు) మాత్రమే అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆరంభంనుంచి దూకుడుగా ఆడిన ఆమె బ్యాట్నుంచే ఇన్నింగ్స్‌లో 60 శాతం పరుగులు రావడం విశేషం. ఇతర బ్యాట్స్‌విమెన్‌లో స్రవంతి నాయుడు (27 బంతుల్లో 11) మినహా మిగతా 9 మంది ఒక అంకెకే పరిమితయ్యారు. ఏ ఒక్కరూ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్సోల్ (3/6) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగా, జెన్నీ గన్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం సారా టేలర్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు), గ్రీన్ వే (41 బంతుల్లో 26; 1 ఫోర్) రాణించడంతో ఇంగ్లండ్ విజయం సులువైంది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కొద్దిగా తడబడినా చిన్న స్కోరు కావడంతో ఇబ్బంది లేకుండా 11 బంతుల ముందే ముగించింది. భారత బౌలర్ సోనియా దబీర్ 2 వికెట్లు పడగొట్టింది. పురుషుల టి20 ప్రపంచకప్‌లో నేడు దక్షిణాఫ్రికా x నెదర్లాండ్స్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి ఇంగ్లండ్ x శ్రీలంక రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
‘ఆరెంజ్’ ఓ రేంజ్లో...
నెదర్లాండ్స్ సిక్సర్ల హోరు ఐర్లాండ్‌పై అద్వితీయ విజయం సూపర్-10కు అర్హత శుక్రవారం మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఇలాంటి స్థితిలో మరో మ్యాచ్ ఏదైనా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కానీ ఒక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కూడా అద్భుతాలు జరిగాయి. పసికూనల పోరు అంటే ఆషామాషీ కాదని ఐర్లాండ్, నెదర్లాండ్స్ నిరూపించాయి. మూడు పదుల సిక్సర్లతో మ్యాచ్‌లో విరుచుకుపడ్డాయి. అద్భుత ఆటతీరుతో నెదర్లాండ్స్ విజయం దక్కించుకోగా... ఐర్లాండ్ భారీ స్కోరూ చిన్నదైపోయింది. ఓవరాల్‌గా ఈ టి20 మ్యాచ్ పంచిన రికార్డు వినోదంతో సిల్హెట్ స్టేడియం దద్దరిల్లింది. సిల్హెట్: ఐర్లాండ్‌తో గ్రూప్ ‘బి’ మ్యాచ్... 14.2 ఓవర్లలో 190 పరుగుల విజయలక్ష్యం... ఓవర్‌కు దాదాపు 13.38 పరుగులు చేయాలి! ఇదీ నెదర్లాండ్స్ జట్టు సూపర్-10కు అర్హత సాధించాలంటే చేయాల్సిన పరుగుల స్థితి. సాధారణంగానే టి20ల్లో ఇది భారీ లక్ష్యం. ఇక 34 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి అంటే ఎంత పెద్ద జట్టయినా మ్యాచ్‌కు ముందే ఒక రకమైన అపనమ్మకం. కానీ ‘ఆరెంజ్ సేన’ అలాంటి లక్ష్యాన్ని లెక్క చేయలేదు. ఏ దశలోనూ వెనుకంజ వేయకుండా ఆడి టి20 చరిత్రలోనే ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అనేక రికార్డులు చెరిపేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టెఫాన్ మైబర్గ్ (23 బంతుల్లో 63; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), టామ్ కూపర్ (15 బంతుల్లో 45; 1 ఫోర్, 6 సిక్స్‌లు), వెస్లీ బారెసి (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పీటర్ బోరెన్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్‌తో కదంతొక్కారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. పాయింటర్ (38 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పోర్టర్‌ఫీల్డ్ (32 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెవిన్ ఓబ్రైన్ (16 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాయ్స్ (25 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) ఐర్లాండ్ భారీ స్కోరుకు బాటలు పరిచారు. నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు బోరెన్, మైబర్గ్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మైబర్గ్ 3, బోరెన్ 1 సిక్స్ బాదడంతో 25 పరుగులు వచ్చాయి. కుసాక్ వేసిన నాలుగో ఓవర్లో మైబర్గ్ మరో 3 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. పవర్‌ప్లేలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తూ వీరిద్దరూ 6 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. 7.4 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద పరుగులు దాటడం కూడా రికార్డే. ఈ దశలో 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో నెదర్లాండ్స్ కొంత వెనుకంజ వేసింది. ఆ వెంటనే ఒక పరుగు వద్ద టామ్ కూపర్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను జాయ్స్ వదిలేయడం ఐర్లాండ్‌ను ముంచింది. తర్వాత డాక్రెల్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడిన కూపర్ మ్యాచ్‌ను లాక్కున్నాడు. కూపర్ అవుటైనా, బారెసి తన జోరును కొనసాగించి 13.5 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. విన్నింగ్ షాట్‌గా బారెసి కొట్టిన సిక్సర్‌తో డచ్ సేన సూపర్-10కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొట్టిన 19 సిక్సర్లు కొత్త ప్రపంచ రికార్డు. 18 సిక్సర్లతో ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఇన్నింగ్స్‌లో 162 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. గతంలో 13.2 ఓవర్లు ఆడినప్పుడు ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు 175 (దక్షిణాఫ్రికా) మాత్రమే. పాపం జింబాబ్వే... సిల్హెట్: చిగుంబురా (21 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించడంతో గ్రూప్ ‘బి’ మరో మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్లతో యూఏఈపై నెగ్గింది. ముందుగా యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్వప్నిల్ పాటిల్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జింబాబ్వే 13.4 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఈ గెలుపుతో జింబాబ్వే సూపర్-10పై ఆశలు పెంచుకుంది. తర్వాతి మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్ నాలుగేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో జింబాబ్వే (+0.957), ఐర్లాండ్ (-0.701)లను వెనక్కినెట్టిన నెదర్లాండ్స్ (+1.109) సూపర్-10కు అర్హత సాధించింది. -
జింబాబ్వే ఆశలు సజీవం
రాణించిన టేలర్, మసకద్జా టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ సిల్హెట్: బ్రెండన్ టేలర్ (39 బంతుల్లో 49; 2 ఫోర్లు, 1 సిక్సర్), మసకద్జా (45 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రధాన టోర్నీకి అర్హత పొందే ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. సిల్హెట్ స్టేడియంలో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. టామ్ కూపర్ (58 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్సర్) వీరవిహారం చేశాడు. బెన్ కూపర్ (24 బంతుల్లో 20; 1 ఫోర్), ముదస్సర్ (16 బంతుల్లో 14 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో జింబాబ్వే బౌలర్లు ఆకట్టుకోవడంతో నెదర్లాండ్స్ టాప్ ఆర్డర్ విలవిలలాడింది. 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే టామ్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. బెన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 52, ముదస్సర్తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించాడు. ఉత్సెయా 2, పన్యాన్‌గర, ముషాంగ్వే తలా ఓ వికెట్ తీశారు. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో సికిందర్ రజా (13) విఫలమైనా మసకద్జా మెరుగ్గా ఆడాడు. టేలర్‌తో కలిసి రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. అయితే మూడు బంతుల వ్యవధిలో మసకద్జా, చిగుంబురా అవుట్ కావడం, చివర్లో నెదర్లాండ్స్ బౌలర్లు చెలరేగడంతో కాస్త ఉత్కంఠ చోటు చేసుకుంది. విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో సీన్ విలియమ్స్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు) ఆరు పరుగులు రాబట్టి రనౌటయ్యాడు. చివరి బంతిని సిబండా (3 బంతుల్లో 9 నాటౌట్; 1 సిక్సర్) సిక్సర్ బాదడంతో జింబాబ్వే ఊపిరి పీల్చుకుంది. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా విజయం డేవిడ్ వార్నర్ (65), ఫించ్ (47) బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 పరుగులతో నెగ్గింది. ముందుగా ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. తర్వాత కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై నెగ్గింది. మొదట పాక్ 17.3 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది.