‘ఆరెంజ్’ ఓ రేంజ్‌లో... | ICC World Twenty20: Netherlands chase 190 in 13.5 overs, storm into Super 10 | Sakshi
Sakshi News home page

‘ఆరెంజ్’ ఓ రేంజ్‌లో...

Published Sat, Mar 22 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM

‘ఆరెంజ్’ ఓ రేంజ్‌లో...

‘ఆరెంజ్’ ఓ రేంజ్‌లో...

నెదర్లాండ్స్ సిక్సర్ల హోరు
 ఐర్లాండ్‌పై అద్వితీయ విజయం
 సూపర్-10కు అర్హత
 
 శుక్రవారం మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఇలాంటి స్థితిలో మరో మ్యాచ్ ఏదైనా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కానీ ఒక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కూడా అద్భుతాలు జరిగాయి. పసికూనల పోరు అంటే ఆషామాషీ కాదని ఐర్లాండ్, నెదర్లాండ్స్ నిరూపించాయి. మూడు పదుల సిక్సర్లతో మ్యాచ్‌లో విరుచుకుపడ్డాయి. అద్భుత ఆటతీరుతో నెదర్లాండ్స్ విజయం దక్కించుకోగా... ఐర్లాండ్ భారీ స్కోరూ చిన్నదైపోయింది. ఓవరాల్‌గా ఈ టి20 మ్యాచ్ పంచిన రికార్డు వినోదంతో సిల్హెట్ స్టేడియం దద్దరిల్లింది.
 
 సిల్హెట్: ఐర్లాండ్‌తో గ్రూప్ ‘బి’ మ్యాచ్... 14.2 ఓవర్లలో 190 పరుగుల విజయలక్ష్యం... ఓవర్‌కు దాదాపు 13.38 పరుగులు చేయాలి! ఇదీ నెదర్లాండ్స్ జట్టు సూపర్-10కు అర్హత సాధించాలంటే చేయాల్సిన పరుగుల స్థితి. సాధారణంగానే టి20ల్లో ఇది భారీ లక్ష్యం. ఇక 34 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి అంటే ఎంత పెద్ద జట్టయినా మ్యాచ్‌కు ముందే ఒక రకమైన అపనమ్మకం. కానీ ‘ఆరెంజ్ సేన’ అలాంటి లక్ష్యాన్ని లెక్క చేయలేదు. ఏ దశలోనూ వెనుకంజ వేయకుండా ఆడి టి20 చరిత్రలోనే ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో అనేక రికార్డులు చెరిపేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టెఫాన్ మైబర్గ్ (23 బంతుల్లో 63; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), టామ్ కూపర్ (15 బంతుల్లో 45; 1 ఫోర్, 6 సిక్స్‌లు), వెస్లీ బారెసి (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పీటర్ బోరెన్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్‌తో కదంతొక్కారు.
 
 ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. పాయింటర్ (38 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పోర్టర్‌ఫీల్డ్ (32 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెవిన్ ఓబ్రైన్ (16 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాయ్‌స్ (25 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) ఐర్లాండ్ భారీ స్కోరుకు బాటలు పరిచారు.
 
 నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు బోరెన్, మైబర్గ్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మైబర్గ్ 3, బోరెన్ 1 సిక్స్ బాదడంతో 25 పరుగులు వచ్చాయి. కుసాక్ వేసిన నాలుగో ఓవర్లో మైబర్గ్ మరో 3 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. పవర్‌ప్లేలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తూ వీరిద్దరూ 6 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. 7.4 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద పరుగులు దాటడం కూడా రికార్డే.
 
 ఈ దశలో 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో నెదర్లాండ్స్ కొంత వెనుకంజ వేసింది. ఆ వెంటనే ఒక పరుగు వద్ద టామ్ కూపర్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను జాయ్‌స్ వదిలేయడం ఐర్లాండ్‌ను ముంచింది. తర్వాత డాక్‌రెల్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడిన కూపర్ మ్యాచ్‌ను లాక్కున్నాడు.
 
 కూపర్ అవుటైనా, బారెసి తన జోరును కొనసాగించి 13.5 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. విన్నింగ్ షాట్‌గా బారెసి కొట్టిన సిక్సర్‌తో డచ్ సేన సూపర్-10కు అర్హత సాధించింది.
 
 నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొట్టిన 19 సిక్సర్లు కొత్త ప్రపంచ రికార్డు. 18 సిక్సర్లతో ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.
 
 ఈ ఇన్నింగ్స్‌లో 162 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి.
 గతంలో 13.2 ఓవర్లు ఆడినప్పుడు ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు 175 (దక్షిణాఫ్రికా) మాత్రమే.
 
 పాపం జింబాబ్వే...
 సిల్హెట్: చిగుంబురా (21 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించడంతో గ్రూప్ ‘బి’ మరో మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్లతో యూఏఈపై నెగ్గింది. ముందుగా యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్వప్నిల్ పాటిల్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జింబాబ్వే 13.4 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఈ గెలుపుతో జింబాబ్వే సూపర్-10పై ఆశలు పెంచుకుంది. తర్వాతి మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్ నాలుగేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో జింబాబ్వే (+0.957), ఐర్లాండ్ (-0.701)లను వెనక్కినెట్టిన నెదర్లాండ్స్ (+1.109) సూపర్-10కు అర్హత సాధించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement