జింబాబ్వే ఆశలు సజీవం
రాణించిన టేలర్, మసకద్జా
టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్
సిల్హెట్: బ్రెండన్ టేలర్ (39 బంతుల్లో 49; 2 ఫోర్లు, 1 సిక్సర్), మసకద్జా (45 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రధాన టోర్నీకి అర్హత పొందే ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. సిల్హెట్ స్టేడియంలో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. టామ్ కూపర్ (58 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్సర్) వీరవిహారం చేశాడు. బెన్ కూపర్ (24 బంతుల్లో 20; 1 ఫోర్), ముదస్సర్ (16 బంతుల్లో 14 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
ఆరంభంలో జింబాబ్వే బౌలర్లు ఆకట్టుకోవడంతో నెదర్లాండ్స్ టాప్ ఆర్డర్ విలవిలలాడింది. 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే టామ్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. బెన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 52, ముదస్సర్‌తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించాడు. ఉత్సెయా 2, పన్యాన్‌గర, ముషాంగ్వే తలా ఓ వికెట్ తీశారు. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో సికిందర్ రజా (13) విఫలమైనా మసకద్జా మెరుగ్గా ఆడాడు. టేలర్‌తో కలిసి రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.
అయితే మూడు బంతుల వ్యవధిలో మసకద్జా, చిగుంబురా అవుట్ కావడం, చివర్లో నెదర్లాండ్స్ బౌలర్లు చెలరేగడంతో కాస్త ఉత్కంఠ చోటు చేసుకుంది. విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో సీన్ విలియమ్స్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు) ఆరు పరుగులు రాబట్టి రనౌటయ్యాడు. చివరి బంతిని సిబండా (3 బంతుల్లో 9 నాటౌట్; 1 సిక్సర్) సిక్సర్ బాదడంతో జింబాబ్వే ఊపిరి పీల్చుకుంది. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆస్ట్రేలియా విజయం
డేవిడ్ వార్నర్ (65), ఫించ్ (47) బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 పరుగులతో నెగ్గింది. ముందుగా ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. తర్వాత కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై నెగ్గింది. మొదట పాక్ 17.3 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది.