పెరిగిన సిలబస్... ఆధునిక బోధనపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్ః ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు హాజరయ్యే అభ్యర్థులు లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా బోధన విధానాల్లో వస్తున్న మార్పులపై నిశిత పరిశీలన ఉండేలా ప్రశ్నలుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) అవగాహన పరిధిని విస్తృతంగా పరిశీలించాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్‌కు సంబంధించి 8వ తరగతి వరకూ కొన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతామని మొదట చెప్పినా, మెథడాలజీలో మాత్రం ఇంటర్మీడియేట్ స్థాయిలోని ఆలోచన ధోరణికి సంబంధించిన చాప్టర్లను జోడించింది.
నవంబర్ 20 నుంచి జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి విద్యాశాఖ గురువారం పరీక్ష సిలబస్‌ను విడుదల చేసింది. ఏ చాప్టర్ నుంచి ఏయే ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ఇందులో పేర్కొంది. ఎస్జీటీ పోస్టులకు పరీక్ష రాసే వారు 1–8వ తరగతి, స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేవారికి 1–10 తరగతులతో పాటు ప్లస్ టు నుంచి ప్రశ్నలు ఇస్తామని విద్యాశాఖ పేర్కొంది.
జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పుల విషయంలో ప్రశ్నలుంటాయని తెలిపింది. ఈ క్రమంలో ఎస్జీటీలకు ఇచ్చే ప్రశ్నలు నిర్ణీత తరగతులు దాటి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే పరీక్ష కావడంతో టీఆర్టీకి ఈసారి ప్రత్యేకంగా శిక్షణ ఉండాలని అభ్యర్థులు అంటున్నారు. ప్రతీ ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. దీంతో ప్రతి ప్రశ్న కూడా కీలకంగానే భావిస్తున్నారు.
మెథడాలజీపై గురి
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిపై పెద్దగా అభ్యంతరాలు రావడం లేదు. అయితే నవీన విద్యా బోధనపై 20 ప్రశ్నలు ఇస్తున్నారు. స్వాతంత్య్రం పూర్వం, తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, వివిధ విద్యా కమిషన్లు, సిఫార్సులు, చట్టాలపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఇస్తున్నారు. ’’స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల ఆలోచనల్లో విద్యా విధానం’’ అనే సబ్జెక్టుల్లోంచి ప్రశ్నలు ఇస్తున్నారు.
ఇవి అకడమిక్ పుస్తకాలతో సంబంధం ఉన్నవి కావని, జనరల్ నాలెడ్జ్‌గానే భావించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. విద్యార్థి, శిక్షణలో అభివృద్ధి అనే అంశంలో వివిధ రకాలుగా వస్తున్న మార్పులు, అధ్యయనాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. కేంద్ర విద్యా చట్టం, మార్పులు అనే అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే, జాతీయ విద్యా చట్టాలపై ప్రశ్నలు ఇస్తున్నారు. మేథమెటిక్స్‌లోనూ ఆలోచన ధోరణి ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాతకాలం విధానాలు కాకుండా, సరికొత్త పద్ధతిలో గణితం విద్యార్థులకు బోధించే ధోరణìలపై ప్రశ్నలు ఉంటాయని సిలబస్‌లో పేర్కొన్నారు.
ఎస్‌ఏలకు 88 ప్రశ్నలు.. ఎస్జీటీలకు 160 ప్రశ్నలు
ఎస్‌ఏలకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడిట్ స్థాయి వరకూ 88 ప్రశ్నలు ఇస్తున్నారు. దీనిపైనా స్పష్టత లేకుంటే ప్రిపరేషన్ సమస్యగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియేట్) స్థాయి ప్రశ్నలు ఇస్తామని చెప్పినా, ఇందులో కమ్యూనికేషన్ స్కిల్ పరీక్షకు సంబంధించినవి ఉంటాయా? సబ్జెక్టు నుంచి ఇస్తారా? అనే దానిపై స్పష్టత కోరుతున్నారు.
టీచింగ్ విధానాలపై 32 ప్రశ్నలు ఇస్తున్నారు. రాష్ట్ర యూనివర్సిటీలు రూపొందించిన వివిధ బోధన పద్ధతుల నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అన్ని కోణాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ సహా 18 సబ్జెక్టులకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు.
ప్రతీ సబ్జెక్టు నుంచి 5కు మించకుండా ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తం 100 ప్రశ్నలను ఈ తరహాలోనే విభజించారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్‌కు 160 ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇంటర్మీడియేట్ సిలబస్‌తో పాటు, కొత్త విద్యావిధానంపై తర్ఫీదు అవ్వాల్సిన అవసరం ఉందని సిలబస్ స్పష్టం చేస్తోంది.