T S Vijayan
-
అన్ని అవసరాలకు ఒకే పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రజల కనీస బీమా అవసరాలను తీర్చుకోవడానికి ఇప్పుడున్న బహుళ పథకాల విధానం దేశీయ బీమా వృద్ధికి ప్రతిబంధకంగా ఉందని, ఇలా కాకుండా కనీస అవసరాలన్నీ తీర్చేవిధంగా ఒకే పథకాన్ని తీసుకురావల్సిన అవసరం ఉందని ఐఆర్డీఏ ప్రకటించింది. జీవిత బీమా, ఆరోగ్యం, వాహనం, అగ్ని ప్రమాదం ఇలా విభిన్న అవసరాల కోసం విడివిడిగా పాలసీలను తీసుకోవాల్సి వస్తోందని, ఇది బీమా విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉందని బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. అసోచామ్ బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఏడవ అంతర్జాతీయ బీమా సదస్సులో పాల్గొన్న ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలసీదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎంపిక చేసుకునేలా జీవిత, సాధారణ బీమా పథకాలను కలిపి ఒకే పథకం కింద అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రస్తుతం బీమా రంగంలో ఉన్న పోకడలను సునిశితంగా విమర్శించారు. కంపెనీలు పథకాలను విక్రయించేటప్పుడు పాలసీదారులపై చూపిస్తున్న ప్రేమ క్లెయింలు వచ్చినప్పుడు ఉండటం లేదని, దీనిపై ఐఆర్డీఏ దృష్టిసారించాలన్నారు. వైద్య, పంటల, సాధారణ బీమా రంగాల్లో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సులభమైన పాలసీలను అందించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీమా, బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
4 లక్షల కోట్లకు బీమా వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపార పరిమాణం రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అంచనా వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపారం (జీవిత, సాధారణ) పరిమాణం రూ.3.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం బీమా వ్యాపారంలో వృద్ధిని ఆశిస్తున్నామని, దీంతో ఈ సంఖ్య రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) స్నాతకోత్సవానికి విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ పాత జీవిత బీమా పథకాలను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్ వరకు గడువిచ్చినట్లు తెలిపారు. కొత్త మార్గదర్శకాలతో రూపొందించిన పథకాలను వేగంగా ఆమోదిస్తున్నామని, ఇప్పటివరకు 450 పథకాలు అనుమతుల కోసం రాగా ఇప్పటికే 300 పథకాలకు అనుమతులను జారీ చేసినట్లు తెలిపారు. బీమా పథకాల్లో డీ-మ్యాట్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం చేసిన సూచనపై ఆయన స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని తప్పనిసరి చేయలేమని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. పాలసీల విక్రయంలో బ్యాంకులను ఏజెంట్లుగా ఒక కంపెనీకి చెందిన పథకాలనే విక్రయించే విధంగా కాకుండా బ్రోకర్ వలే అన్ని కంపెనీల పథకాలనూ విక్రయించడం వంటి సంస్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 15 నుంచి 20 మంది ఆఫీసర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.