విభజనను తట్టుకోలేక ఆగిన గుండెలు
సీమాంధ్రలో ఏడుగురు మృతి
న్యూస్‌లైన్ నెట్వర్క్: రాష్ట్ర విభజనను తట్టుకోలేక సీమాంధ్ర జిల్లాలో బుధవారం ఏడుగురు మరణించారు. కృష్ణాజిల్లాలో అత్యధికంగా నలుగురు మరణించగా, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖ జిల్లాల్లో మరో ముగ్గురు తనువు చాలించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో పాస్టర్ ఖండెల్లి ప్రభాకర్ (40).. విభజన వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని మంగళవారం రాత్రంతా ఆవేదన చెందాడని, బుధవారం మధ్యాహ్నం గుండె ఆగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన తాడేపల్లి సాంబశివరావు (70) విభజన వార్తలతో కలత చెంది మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు.
విశాఖ జిల్లా పద్మనాభం మండలం పెంట గ్రామంలో రొంగలి రాము (55) కూడా మంగళవారం రాత్రి విభజన వార్తలు చూసి కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
కృష్ణాజిల్లాలో..: చాట్రాయి మండలం పర్వతాపురానికి చెందిన బయగాని మానియ్య (68), వత్సవాయి మండలం శింగవరం గ్రామానికి చెందిన కొలగాని కొండయ్య (52), కంకిపాడుకు చెందిన మద్దుల తాతారావు (60), కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన కాండ్రు ఏసురత్నం (60)లు కూడా విభజన వార్తలు చూస్తూ గుండెపోటుకు గురై మృతిచెందాడు.