సిద్దిపేట కలలు నిజం కానున్నాయి
►తడ్కపల్లి రిజర్వాయర్ ఏర్పాటుతో మరో కోనసీమగా సిద్దిపేట
►పల్లెలకూ నిరంతరం విద్యుత్తు సరఫరా
►వచ్చే నెల నుంచి గర్భిణులకు సన్నబియ్యం
►నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్ : సిద్దిపేటకు రైలు.. నీళ్లు.. జిల్లా.. అవుతుందని కొన్నేండ్లుగా కలలు కంటున్నాం.. అవి త్వరలో నిజం కానున్నాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ మండలంలోని తడ్కపల్లి గ్రామంలో 30 టీఎంసీలతో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నామని, దీంతో నియోజకవర్గంలోని 1.20 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయ న్నారు. దీంతో సిద్దిపేట నియోజకవర్గం మరో కోనసీమగా మారనుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేదని సీఎం కేసీఆర్ చొరవతో హైదరాబాద్‌లో 24 గంటల నిరంతర విద్యుత్తు ఎలా సరఫరా చేస్తున్నామో అదే విధంగా పల్లెల్లో కూడా 24 గంటల పాటు విద్యుత్తును ఈ వేసవి నుంచే అందిస్తున్నామని, దీంతో హైదరాబాద్ మాదిరిగానే పల్లెల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. మరో ఆరు నెలల్లో వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను పగటి పూటనే అందిస్తామన్నారు. ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తోందని దానిలో భాగంగానే వచ్చే నెల నుంచి గర్భిణులకు సన్న బియ్యాన్ని అంగన్వాడీల ద్వారా అందజేస్తామన్నారు.
చింతమడక గ్రామం పుట్టినప్పటి నుంచి ఇన్ని అభివృద్ధి పనులు ఎప్పుడూ జరగలేదని, ఇక్కడ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను చింతమడక గ్రామానికి తీసుకొచ్చి మరిన్ని మంచి పనులు ప్రారంభిస్తామని సూచించారు. గ్రామాలను దశల వారీగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చింతమడక చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోనుందని, కేసీఆర్ ఆ గ్రామంలో జన్మించడమే అందుకు కారణమన్నారు. చింతమడకలో పుట్టిన కేసీఆర్ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి ప్రణాళికలతో ముందుకెళ్లి తెలంగాణను సాధించడం మెదక్ జిల్లా అదృష్టమన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ యాదగిరి, ఎంపీపీ యాదయ్య, వైస్ ఎంపీపీ శ్రీహరిగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పయ్యావుల రాములు, నాయకులు రవీందర్‌రెడ్డి, బాలకిషన్‌రావు, నరేందర్‌రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.