Tailpond Dam
-
భయం..భయం
సాక్షి, అడవిదేవులపల్లి (మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారింది. అడవిదేవులపల్లి మండలం చిట్యాల, నడిగడ్డ, జాలికోటతండా, చింతలపాలెంలో టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్ గ్రామ పరిసరాల్లోకి వస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఇళ్లలోకి తరుచూ మొసళ్లు, విష సర్పాలు వస్తున్నాయి.దీంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నారు. దాంతో తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గుర్తించిన ఇళ్లు ఇవే టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్‌కు 100 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను జెన్కో, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. పలు సర్వేలు, గ్రామ సభల అనంతరం గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. చిట్యాలలో మొత్తం 225 ఇళ్లు ఉండగా వీటిలో 167, నడిగడ్డలో 91 ఇళ్లకు 46, జాలికోట తండాలో 65కు ఏడు, చింతలపాలెంలో 450 ఇళ్లకు ఏడు ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని అధికారులు తేల్చారు. ఈ గృహాలకే ఆర్ఆర్ ప్యాకేజీని వర్తింప జేస్తామని చెప్పారు. అయితే గ్రామస్తులు మాత్రం గ్రామం మొత్తాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించి అందరికీ పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పునరావాసం కల్పించాలి టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్‌తో భయపడుతున్నాం. దీంతో పాటుగా గ్రామంలోకి తరుచూ మొసళ్లు, విషసర్పాలు వస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరావాసం కల్పించాలి. – జానపాటి మస్తాన్, చిట్యాల -
శ్రీశైలం టెయిల్‌పాండ్ డ్యాంకు గండి
కోట్ల రూపాయలు కృష్ణార్పణం! మన్ననూర్: తెలంగాణ రాష్ట్ర జెన్కో ఆధ్వర్యంలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీశైలం టెయిల్‌పాండ్ కాంక్రీట్ డ్యాంకు గండిపడింది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు అనుసంధానంగా మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం వజ్రాలమడుగు వద్ద పాతాళగంగ నుంచి సుమారు 16కి.మీ దూరంలో ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని 2003లో ప్రారంభించగా.. 12 ఏళ్లుగా కొనసాగుతోంది. కృష్ణానది బ్యాక్ వాటర్‌ను మళ్లించి జలవిద్యుదుత్పత్తిని చేసేందుకు ఈ టెయిల్‌పాండ్ డ్యాంను నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న డ్యాం శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో విద్యుదుత్పాదన కొనసాగుతుండటంతో కొద్దిపాటి ప్రవాహానికి నిర్మాణంలోని డ్యాం మధ్య భాగంలో సుమారు 30 అడుగుల వెడల్పు, ఎత్తులో కాంక్రీట్ కొట్టుకుపోయింది. ఈ కారణంగా నిల్వ నీరు దిగువకు పారుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో గండిపడినట్లు లింగాలగట్టు, పాతాళగంగ మత్స్యకారులు చెబుతున్నారు. మూడు నెలలుగా ఈ డ్యాంకు పగుళ్లు ఏర్పడినట్లు పేర్కొంటున్నారు. నీటిలో వేయాల్సిన ట్రీమి కాంక్రీట్‌లో నాణ్యత లోపించడం వల్లే గండిపడినట్లు ఇంజనీరింగ్ నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. అకస్మాత్తుగా కాంక్రీట్ డ్యాంకు గండిపడడంతో మత్స్యకారుల వలలు, బుట్టలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు డ్యాం దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడం ద్వారా చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జెఎన్‌కో ఉన్నతాధికారులు వజ్రాలమడుగుకు చేరుకునే అవకాశం ఉందని తెలిసింది. కాగా, టెయిల్‌పాండ్ డ్యాం నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నట్లు ప్రారంభం నుంచీ ఆరోపణలు రావడం గమనార్హం.