సాక్షి, అడవిదేవులపల్లి (మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారింది. అడవిదేవులపల్లి మండలం చిట్యాల, నడిగడ్డ, జాలికోటతండా, చింతలపాలెంలో టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్ గ్రామ పరిసరాల్లోకి వస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఇళ్లలోకి తరుచూ మొసళ్లు, విష సర్పాలు వస్తున్నాయి.దీంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నారు. దాంతో తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు గుర్తించిన ఇళ్లు ఇవే
టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్‌కు 100 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను జెన్‌కో, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. పలు సర్వేలు, గ్రామ సభల అనంతరం గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. చిట్యాలలో మొత్తం 225 ఇళ్లు ఉండగా వీటిలో 167, నడిగడ్డలో 91 ఇళ్లకు 46, జాలికోట తండాలో 65కు ఏడు, చింతలపాలెంలో 450 ఇళ్లకు ఏడు ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని అధికారులు తేల్చారు. ఈ గృహాలకే ఆర్‌ఆర్ ప్యాకేజీని వర్తింప జేస్తామని చెప్పారు. అయితే గ్రామస్తులు మాత్రం గ్రామం మొత్తాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించి అందరికీ పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పునరావాసం కల్పించాలి
టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్‌తో భయపడుతున్నాం. దీంతో పాటుగా గ్రామంలోకి తరుచూ మొసళ్లు, విషసర్పాలు వస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరావాసం కల్పించాలి.
– జానపాటి మస్తాన్, చిట్యాల
Comments
Please login to add a commentAdd a comment