ఇలా అయితే మేక్ ఇన్ ఇండియా అసాధ్యం
{పభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే అభివృద్ధిలో వెనుకబాటే
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు సంఘీభావం
కవాడిగూడ: ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ మరోవైపు కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని పిలుపునివ్వడం ఎంతవరకు సబబని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడిన ప్రభుత్వ రంగసంస్థలను పటిష్టం చేస్తేనే ప్రభుత్వం ఆశించిన మేక్ ఇన్ ఇండియా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) కంపెనీని మూతవేయాలనే కుట్రలకు నిరసనగా హెచ్‌సీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగళవారం మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి కోదండరాం, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్ (సీపీఐ), సున్నం రాజయ్య (సీపీఎం), బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, సీఐటీయూ నాయకులు సాయిబాబా, ఏఐటీయూసీ నాయకులు వీఎస్ బోస్‌లు హాజరై హెచ్‌సీఎల్ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కోదండరాం మాట్లాడుతూ దేశంలో పెట్టుబడులు లేనప్పుడు ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే పారిశ్రామిక అభివృద్ధి జరిగిందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజకీయజోక్యం అధికమవడం వల్లే ఎక్కువ శాతం ప్రభుత్వ కంపెనీలు మూతపడ్డాయని వివరించారు. ప్రభుత్వ కంపెనీలు మూతపడిన కారణంగా కేవలం హైదరాబాద్ నగరంలోనే సుమారు 25 వేల మంది ఉద్యోగులను తొలగించారని తెలిపారు. హెచ్‌సీఎల్ కంపెనీని ఓఎఫ్‌బీ (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు) తీసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు తీసుకుంటున్న అడ్డుగోలు నిర్ణయాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగువుతున్నాయని పేర్కొన్నారు. ప్రయివేటు కేబుల్ పరిశ్రమలకు అనుమతిచ్చి హెచ్సీఎల్ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా డిఫెన్స్ అసోసియేషన్ నాయకులు చంద్రయ్య, ఇసీఐఎల్, మిథానీ, బీఇఎల్, బీహెచ్ఇఎల్ తదితర కార్మిక సంఘాల నేతలతో పాటు హెచ్‌సీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.సుబ్బారావు, ఉపాధ్యక్షులు శరత్‌బాబు, బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.దామోదరరెడ్డి, సహాయ కార్యదర్శులు పాపయ్య, లక్ష్మీనారాయణ, పద్మారావు, సాంబశివారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.