కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కార్మికవ్యతిరేక విధానాలు
-టీఏకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బంటుశ్రీనివాస్, నర్సాగౌడ్
మెదక్ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీఎకేఎస్)రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బంటు శ్రీనివాస్, నర్సాగౌడ్లు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో టీఏకెఎస్ మెదక్ జిల్లా మొదటి మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక నిర్ణయాల వల్ల లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారని వాపోయారు.
కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. హామీలు నెరవేర్చే వరకు సమర శీల పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులకనుగుణంగా ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మారుస్తున్నాయని ఆరోపించారు.
అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కరువై, ఈఎస్ఐ, పిఎఫ్ లేకపోవడంతో నానా పాట్లు పడుతున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుంటామన్న తెలంగాణ ఎన్నికలు ముగిసి పోయి ఉన్న కార్మికులను సైతం తొలగిస్తున్నారని వాపోయారు. రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.