talasini srinivas yadav
-
'ఆరు కేజీల బియ్యం సక్రమంగా అందేలా చర్యలు'
హైదరాబాద్: రేషన్ షాపుల్లో వినియోగదారులకు ఇవ్వాల్సిన సరుకులు దారి తప్పుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే రేషన్ షాపుల ఫిర్యాదులకు 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆరు కేజీల బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురువారం సికింద్రాబాద్ లో రేషన్ షాపుల పనితీరుపై సమీక్ష నిర్వహించిన తలసాని అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారులు నిత్యం తనిఖీలు చేసి ప్రజలకు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్న రేషన్ షాపులను మార్చాలని ఆయన సూచించారు. నెలలంతా నిర్ణీత వేళలో షాపులు తెరచి ఉంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పారు. వైఎస్ చైర్మన్ గా టీఆర్ఎస్ అభ్యర్థే ఉంటారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.5 కోట్లు ఖర్చు పెట్టించారని ఆరోపించారు. టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పారని, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని అన్నారు. మొత్తం 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు టీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. టీడీపీ, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. -
టీఆర్ఎస్ సత్తా చూపించాం: తలసాని
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సత్తా చూపించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లో తేల్చుకుందామన్న టీడీపీకీ కంటోన్మెంట్ ఫలితాలే సమాధానమని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని అన్నారు. ఉపాధ్యక్షులు ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ల సత్తా బయటపడిందని తలసాని ఎద్దేవా చేశారు. కాగా ఇప్పటివరకూ ఆరు వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఒకటవ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మహేశ్వర్రెడ్డి గెలుపొందగా, 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కేశవరెడ్డి విజయం సాధించారు. 3వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్, 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నళినీ కిరణ్ విజయం సాధించారు. అయిదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణ గెలుపొందగా, ఆరో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పాండు యాదవ్ విజయం సాధించారు. ఇంకా రెండు వార్డుల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి.