చిన్న కంపెనీలకు వరంగా మారిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ నుంచి వలసలు చిన్న కంపెనీల పాలిట వరంగా మారాయి. ఇటీవలి కాలంలో ఈ ఐటీ దిగ్గజ కంపెనీ నుంచి చాలామంది వేరే వేరే కంపెనీలకు వలస వెళ్లిపోతున్నారు. ఇన్ఫీలంతా మంచి నైపుణ్యం గలవారు కావడం, వాళ్లు ఇప్పుడు ఇతర కంపెనీలకు అందుబాటులో ఉండటంతో ఆ కంపెనీలు ఇప్పుడు పండగ చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లుగా ఇంత నైపుణ్యం ఉన్నవాళ్లు తమకు దొరక్కపోవడంతో దాదాపుగా అలాంటి కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా వాళ్లు బయటకు రావడంతో వీళ్లకు కూడా అవకాశం వస్తోంది.
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ బి.జి. శ్రీనివాస్ బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆయన హాంకాంగ్‌కు చెందిన టెలికం, ఇంటర్నెట్, ఐటీ సంస్థ పీసీసీడబ్ల్యులో చేరుతున్నారు. గత సంవత్సరం ఆగస్టులో రాజీనామా చేసిన మాజీ బోర్డు సభ్యుడు అశోక్ వేమూరి ఐగేట్ సీఈవోగా వెళ్లారు. గ్లోబల్ డెలివరీ అధినేతగా ఉండి ఏప్రిల్‌లో రాజీనామా చేసిన చంద్రశేఖర్ కకల్ ఇటీవలే ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సంస్థకు సీఓఓగా చేరారు. గత ఆగస్టులో రాజీనామా చేసిన సుధీర్ చతుర్వేది ఎన్ఐఐటీ టెక్నాలజీస్ సీఓఓగా చేరారు. ఇంకా కొంతమంది మైండ్ ట్రీ, యాక్సెంచర్, క్యాప్ జెమిని లాంటి కంపెనీలకు కూడా వెళ్లారు.
టాప్ ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే కాక.. ఇన్ఫోసిస్‌లో క్వాలిటీ లాంటి విభాగాల్లో సీనియర్, జూనియర్ స్థాయిల్లో ఉన్నవాళ్లు కూడా ఇటీవలి కాలంలో ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు.