Tamarind pulp
-
అడవి చింత.. చారెడంత!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అరే.. చింతగింజలు ఏమిటి ఇంత భారీ సైజులో కనిపిస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇవి చింతగింజలు కాదు.. అచ్చం వాటిని పోలినట్లు ఉండే అడవిచింత గింజలు! మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో పెరిగే ఓ భారీ తీగ జాతి మొక్క నుంచి వీటిని సేకరిస్తారు. ఈ మొక్క కాండం చాలా పొడవుగా ఉంటుంది. దీని కాయలు సుమారు 4–5 అడుగుల వరకు పెరుగుతాయి. అచ్చం చింతకాయలను పోలి ఉండటంతో వీటిని ఆయా రాష్ట్రాల సరిహద్దులో ఉండే తెలుగువారు అడవిచింత గింజలుగా పిలుస్తున్నారు. ఈ గింజలను కరీంనగర్‌లోని పలు కూడళ్ల వద్ద ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజనులు ఒక్కోటి సుమారు రూ. 30 వరకు విక్రయిస్తున్నారు. ఈ గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని... పచ్చకామెర్లు, పంటినొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించే గుణం వీటికి ఉందని చెబుతున్నారు. ఈ చింతగింజల నుంచి తీసిన నూనెను ఏదైనా గానుగ నూనెతో కలిపి కీళ్లనొప్పులకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. దట్టమైన అడవిలోనే పెరుగుతాయి ఈ అడవిచింత సీసాల్పనేసి కుటుంబపు మొక్క. దీని శాస్త్రీయ నామం ఎంటాడా పరిసేత. అధిక వర్షపాతంగల దట్టమైన అడవుల్లో పెరిగే ఔషధ మొక్క. ఈ తీగజాతి నుంచి గుత్తులు గుత్తులుగా చింతపండు ఆకారంలో వచ్చే పొడవైన కాయల నుంచి గింజలను గిరిజనులు సేకరిస్తారు. తెలంగాణలో ఇలాంటి తీగజాతులు ఎక్కడాలేవు. ఏపీలోని తలకోన, శేషాచలం అడవులు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలు వాటికి అనుకూలం. – డాక్టర్ నరసింహమూర్తి, శాతవాహన యూనివర్సిటీ -
Beauty Tips: చింతపండు సిరప్‌తో మొటిమలు, మచ్చలు మాయం!
Benefits Of Tamarind Syrup: కూరల్లో పులుపు, రుచికోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్స్, ఐరన్, పొటాషియం, ఖనిజపోషకాలు, పీచుపదార్థంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చింతపండు రోగాల నుంచి శరీరాన్ని కాపాడడమేగాక, శరీరానికి తగినంత రక్తాన్ని అందించి చర్మాన్ని మెరిపిస్తుంది. చింతపండులోని విటమిన్ సి ముఖం మీద మొటిమలు తొలగించి అందంగా ఉంచుతుంది. ఇన్ని గుణాలు ఉన్న చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా ఈ గుణాలన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇంకెందుకాలస్యం... చింతపండు సిరప్ తయారీ, వాడకం గురించి తెలుసుకుందాం... ఇలా చేయండి.. ►చింతపండుని నీళ్లలో మరిగించి వడగట్టాలి. ►ఈ నీటిలో కొద్దిగా తేనె లేదా బెల్లం వేసి బాగా కలపాలి. ►దీనిలో నాలుగైదు ఐస్‌ముక్కలు వేస్తే చింతపండు సిరప్ రెడీ! దీనిని నేరుగా తాగేయాలి. మొటిమలు, మచ్చలు మాయం! ►చింతపండు మరిగించిన నీటిలో కొద్దిగా తేనెవేసి ముఖానికి అప్లై చేయాలి. ►ఇరవైనిమిషాలపాటు మర్దనచేసి ఆరాక కడిగేయాలి. ►వారానికి రెండుమూడుసార్లు ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. ►సిరప్‌ను తరచూ తాగినా ఆరోగ్యంతోపాటు, చర్మం అందంగా మెరుస్తుంది. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Sonakshi Sinha: అమ్మ చెప్పింది.. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు, ట్యాన్ దరిచేరవు! -
అధరహో...సిరులు కురుపిస్తున్న చింత
సాక్షి,పాడేరు: చింతపండు గిరిజనుల ఇంట సిరులు కురిపిస్తోంది. ఈ ఏడాది మంచి ధర లభించింది. ప్రైవేట్ వ్యాపారులు, జీసీసీ సిబ్బంది పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని పాడేరు డివిజన్లో 11 మండలాలు, రంపచోడవరం డివిజన్ పరిధిలో మారెడుమిల్లి ప్రాంతంలో వ్యాపారం జోరుగా సాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో చింతపండు దిగుబడి ఆశాజనకంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని చింతపండుకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. జీసీసీ సిబ్బంది, ప్రైవేట్ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి చివరిదశకు చేరుకోవడంతో కొనుగోలులో పోటీ నెలకొంది. గిరిజన సహకార సంస్థ ఈ ఏడాది కిలో రూ.32.40 మద్దతు ధరతో భారీగా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది చింతపల్లి, పాడేరు డివిజన్ల పరిధిలో సుమారు 120 టన్నుల వరకు జీసీసీ కొనుగోలు చేసింది. మార్చి నెల సీజన్ ప్రారంభంలో కిలో రూ.25 నుంచి రూ.30 వరకు వ్యాపారులు కొనుగోలు చేయగా, జీసీసీ రూ.32.40కు కొనుగోలు చేసింది. మార్కెట్లో పోటీగా ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు కూడా ధరను పెంచారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు చింతపండు నాణ్యతను బట్టి కిలో రూ.35 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తున్నారు.అయితే తూకంలో మాత్రం తేడాలు ఉండడంతో మోసపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు. సంతల్లో విక్రయాలు పలువురు గిరిజనులు తాము సేకరించిన చింతపండును సంతల్లో విక్రయిస్తున్నారు. దేవరాపల్లి, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు సంతల్లో చింతపండును భారీగా విక్రయించారు. ప్రైవేటు వ్యాపారులు,స్థానిక ప్రజలు 15 కిలోల బరువు తూగే చింతపండు బుట్టను రూ.500 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేశారు. భారీగా కొనుగోలు గిరిజన సహకార సంస్థ అన్ని వారపుసంతల్లో చింతపండును భారీగా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది కొనుగోలు చేసిన చింతపండు నిల్వలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నప్పటికీ ఈ ఏడాది గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. పాడేరు డివిజన్లో 230 క్వింటాళ్లు, చింతపల్లిలో 100 క్వింటాళ్లు కొనుగోలు చేశాం. ఈ నెలలో లక్ష్యం మేరకు చింతపండును కొనుగోలు చేస్తాం. గిరిజనులంతా జీసీసీ సంస్థకు సహకరించాలి. – కురుసా పార్వతమ్మ, జీసీసీ డీఎం,పాడేరు -
చింత చిగురు - రొయ్యల కూర
కావలసిన పదార్థాలు: పచ్చిరొయ్యలు - 1 కప్పు, చింత చిగురు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, కారం - 2 చెంచాలు, గరం మసాలా - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా తయారీ విధానం: రొయ్యల తోకలు వదిలేసి మిగతా గుల్ల ఒలిచెయ్యాలి. కొంచెం ఉప్పు వేసి వాటిని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి; చింతచిగురును శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. కానీ మరీ మెత్తగా అవ్వకూడదు. జారుడుగానూ అవ్వకూడదు; ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి; రంగు మారాక రొయ్యలు వేసి కాసేపు వేగనివ్వాలి; తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి; తర్వాత చింతచిగురు మిశ్రమం వేసి, గరం మసాలా చల్లి మూత పెట్టెయ్యాలి; అప్పుడప్పుడూ కలుపుతూ, తక్కువ మంటమీద ఉడకనివ్వాలి; చింత చిగురు రొయ్యలకు పూర్తిగా పట్టి, కూర బాగా దగ్గరగా అయిపోయాక దించేసుకోవాలి.