రేపు తమిళనాడు బంద్
చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడులో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధం తొలగించాలని తమిళులు భారీ స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. రేపు(శుక్రవారం) రాష్ట్ర బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. బంద్ కు డీఎంకే మద్దతు తెలిపింది. మెరీనా బీచ్ లో గురువారం రాత్రి నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జల్లికట్టుకు మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ కూడా మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఉపవాసం ఉంటానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ప్రకటించారు.
జల్లికట్టుపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని డీఎంకే నాయకురాలు కనిమొళి విమర్శించారు. దీనిపై చర్చించేందుకు తమిళనాడు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీలో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఎంపీలు భేటీ కానున్నారు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.