పోలీసుల పనితీరుపై విమర్శలు
సాక్షి, చిత్తూరు: తీవ్రవాదుల ఉనికి వెలుగుచూడటంతో పుత్తూరు పోలీసు సబ్‌డివిజన్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏడాదిగా తీవ్రవాదులు ఉంటున్న ఇంటికి పుత్తూరు పోలీసుస్టేషన్, డీఎస్పీ కార్యాలయం కూతవేటు దూరంలో ఉన్నాయి.
ఆపరేషన్ లైవ్ షో....
ఇటీవల సినిమాల్లో పోలీసు ఆపరేషన్లు చూపిన తీరులోనే పుత్తూరు పోలీసు ఆపరేషన్ జరిగింది. తమిళనాడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, తిరుమల ఆక్టోపస్ కమాండోలు మిద్దెలపైకి వెళ్లి పొజిషన్ తీసుకున్నారు. తీవ్రవాదులు ఉంటున్న వీధిలో తెల్లవారుజామునే కాల్పులమోత, పోలీసుల అరుపులతో దద్దరిల్లడంతో ఏం జరుగుతుందో అర్థంకాక స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్రవాదులు ఉన్న ఇంటికి సమీపంలోని ఇళ్ల నుంచి జనాన్ని ఖాళీ చేయించారు. అక్కడ ఏం జరుగుతున్నదీ ప్రజలకు కనబడకుండా పరదాలు కట్టారు. తమిళనాడు, తిరుపతి నుంచి వచ్చిన లైవ్ మీడియా వెహికల్స్ ఏం జరుగుతుందో చిత్రీకరించేందుకు పోటీలు పడ్డాయి. జనం కూడా భయపడకుండా రైల్వే ఓవర్బ్రిడ్జిపైన, ట్రాక్‌పైన, చుట్టుపక్కల ఉన్న ఇళ్ల డాబాలపైన ఎక్కి చూస్తూ నిలబడ్డారు. తీవ్రవాదులను అరెస్ట్ చేశాక ఆ ఇళ్లు చూసేందుకు జనం పోటీపడ్డారు.