tamils
-
సరిగమల తాలింపు మార్గళి మేళవింపు
చెన్నైవాసులకు ఈ ‘మార్గళి’ సంగీత మాసం. ఈ ముప్పై రోజులూ నగరమంతా సంగీతంతో ‘ఘుమఘుమ’లాడుతుంది. సభలన్నీ సంప్రదాయ నృత్యాలతో ఇంద్రసభను మించిపోతాయి. పట్టుచీరలు, బంగారు నగలు, పరిమళాలు వెదజల్లే కుసుమాలు, నుదుటన రూపాయ బిళ్లంత బొట్లు.. చూడ్డానికి రెండు కళ్లు కాదు కదా, శివుడి మూడు కళ్లు, సాక్షాత్తూ ఇంద్రుడి సహస్రాక్షులు కూడా సరిపోవు అన్నట్లు ఉంటుంది ఈ నాలుగు వారాలూ చెన్నై. ధనుర్మాసంలో చెన్నైలో జరిగే ఉత్సవాలే మార్గళి. ఈసారి మార్గళి డిసెంబర్ 16న మొదలైంది. జనవరి 14 వరకు జరుగుతుంది. మన పుష్య మాసాన్నే తమిళులు మార్గళి అంటారు. అతిథులకు ఆతిథ్యం ఇచ్చే మాసం ఇది. దేశంలోని కళాకారులందరూ వలస పక్షుల్లా ఇక్కడకు వచ్చి ఏదో ఒక సభలో తమ సంగీత పరిజ్ఞానాన్ని అందరితో పంచుకుంటారు. అందుకే చెన్నైకిది మ్యూజిక్ సీజన్ కూడా. చెన్నైలోని నారద గాన సభ, కృష్ణ సభ, వాణి మహల్ అన్నీ ఈ నాలుగు వారాలూ కిటకిటలాడతాయి. మహిళలు కంచిపట్టు చీరలు, యువతులు కుర్తీ పైజమాలు, వృద్ధులు పంచెలతో భోజనాల దగ్గర సహపంక్తిలో కూర్చొని విందు ఆరగిస్తారు. అరటి ఆకులలో వడ్డించిన అన్నం, ఇలై సాపాడు, సాంబారు అన్నం, పాయసం రకరకాల స్వీట్లు తింటూ కనిపిస్తారు. కొందరు మద్రాసు ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలను ఆఘ్రాణిస్తారు. చెన్నై నగరంలో మొత్తం యాభై ప్రదేశాలలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు వచ్చేందుకు పదకొండు నెలల పాటు డబ్బులు దాచుకుంటామని చెబుతారు ఇక్కడకు వచ్చే సంగీతాభిమానులు. ‘‘హోటల్స్‌కి వెళ్లి భోజనం చేస్తే, పొట్ట బరువుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడి ఆహారం మాత్రం చాలా తేలికగా ఉంటుంది’’ అంటారు వాళ్లు నవ్వుతూ. అందుకే, ఒకప్పుడు తన క్యాంటీన్లో కేవలం కాఫీ, బజ్జీలు మాత్రమే అమ్మే బాలాజీ పట్టప్ప.. కాలగమనంలో తన మెనూ మార్చుకోవలసి వచ్చింది. ‘పట్టప్ప’ క్యాంటీన్ యజమాని బాలాజీ పట్టప్ప. అతి ప్రాచీనమైన మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో ఈ క్యాంటీన్ తన సేవలను అందిస్తోంది. కొత్తగా కీర వడ, కుళుంబు, కూటులతో పాటు పుచ్చకాయ రసం (సాంబారు), వెజిటబుల్ పాయసం కూడా చేర్చారు. ఈ కొత్త రుచులకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. అయితే రానురాను ఈ సభలలో సంగీతం కంటే రుచులకే ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోందని కొంతమంది సంగీత ప్రియులు వాపోతున్నారు. ఒక దశాబ్ది కాలంగా ఈ మార్గళి ఉత్సవాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న సినీ నేపథ్య గాయకుడు ఉన్నికృష్ణన్ కూడా ఈ విషయంలో కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. ‘‘ఆహారం మీద ధ్యాస ఉంటే, సంగీత కచేరీలను శ్రద్ధగా వినలేకపోతారు’’ అంటారు ఆయన. అయితే, ‘‘ఈ కచేరీలకు వస్తే, వండుకోవడానికి కుదరదు. కచేరీకి కచేరీకి మధ్యలో ఏదో కొద్దిగా తినడానికి ఏమైనా ఉండడం మంచిదే కదా’’ అంటున్నారు ఉమా శ్రీనివాసన్ (పట్టప్ప కుమార్తె). ముందు కనువిందు..! ట్రిప్లికేన్‌లోని పార్థసారథి స్వామి సభ నిత్యం సంగీత ఆస్వాదకులతో నిండిపోతుంది. ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ ఈ సభలకు హాజరవుతుంటారు. వీరు కూడా అక్కడకు రాగానే మొదట మెనూలో ఏముందో చదువుతారు. బొప్పాయి వేపుడు, చిలగడదుంపల వడ, బాదం బొబ్బట్లు, పల్లీ పుడ్డింగ్ వంటి వాటిని అక్కడ అందరికీ సుపరిచితులైన మౌంట్‌బాటెన్ మణి అయ్యర్ తయారు చేయిస్తుంటారు. అయ్యర్ 1960 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం లార్డ్ మౌంట్‌బాటెన్ మద్రాసు వచ్చారు. గిండీ నుంచి పాలన చేసేవారు. ఆ సమయంలో మా నాన్నగారి వయసు 17. ఆయన వారికి స్వచ్ఛమైన దక్షిణ భారత భోజనం అందించేవారు. అందులో బాదం హల్వా, బంగాళదుంపల వేపుడు, సాంబారు అన్నం, పాల పాయసం ఉండేవి. నాన్నగారు తయారుచేసిన రుచికరమైన ఆహారానికి సంబర పడిన మౌంట్ బాటెన్ పేరుమీదుగా మా నాన్నగారు తన వ్యాపారం ఆ పేరుతోనే ప్రారంభించారు.మౌంట్ బాటెన్ మణి అయ్యర్ క్యాంటీన్ రుచుల గురించి అందరికీ తెలియడంతో, అందుకు భిన్నంగా పట్టప్ప పురాతన సంప్రదాయ వంటలైన క్షీరాన్నం, అక్కడర వడిసల్ (పాలు, పంచదారలతో చేసేది), బూడిద గుమ్మడి కాయ రైతా, రసవాంగీ (వంకాయ గ్రేవీ), మూర్ కూటు (మజ్జిగ గ్రేవీ), సెన్నై సోదీ (కంద కూర) వంటకాలను తయారుచేయడం ప్రారంభించారు. ఈ వంటకాలకు మంచి ఆదరణ వచ్చింది. ఈ వంటకాలను వేరే చోట తినగలం, కాని క్షీరాన్నం మాత్రం ఇంకెక్కడా దొరకదు’ అంటారు అక్కడ భోజనం చేసినవారంతా. మార్గళి క్యాంటీన్లలో పదిహేను రోజులు ముందుగానే మెనూ సిద్ధం చేస్తారు. ప్రసిద్ధులైనవారి కచేరీలు ఉంటే, ఆరోజు మెనూ కూడా చాలా ప్రసిద్ధంగా, ఎక్కువ వంటకాలతో రూపొందిస్తారు. యువతకు ఆకర్షణీయంగా, వృద్ధులకు తేలికగా అరిగే వంటకాలతో ఉంటుంది మెనూ.ఒకప్పుడు సభకు వచ్చేవారి టికెట్ చూసి మాత్రమే భోజనాలకు అనుమతించేవారు. కానీ ఇప్పుడు కచేరీలకు రాకపోయినా, క్యాంటీన్‌కి వచ్చి భోజనం చేయవచ్చు. ‘‘వండిన వంట కంటే తక్కువ మంది వచ్చినా, ఎక్కువ మంది వచ్చినా ఏమీ చేయలేమని, ఉదయం 7.30 నుంచి వంట ప్రారంభమవుతుందని’’ చెబుతారు పట్టప్ప. మలేసియాలో నివసించే ఉమా బాలన్ అనే సంగీతాభిమాని ప్రతి సంవత్సరం ఈ కచేరీల కోసం మద్రాసు వస్తారు. భోజనాల దగ్గర వారు ప్రేమగా నెయ్యి వడ్డించడం దగ్గర నుంచి అన్నీ ఆవిడ మనసుని హత్తుకున్నాయట. సంగీత సాహిత్య సమలంకృతే అనడానికి బదులు సంగీత ఆహార సమలంకృతే అనాలేమో ఈ మార్గళి మాసాన్ని. – జయంతి -
రైతుల కపాల దీక్షకు కనిమొళి మద్దతు
-
రజనీ టూరు: తమిళ నేతల అసలు రంగు బయటకు!
చెన్నై: తమిళసంఘాల ఆగ్రహంతో సూపర్ స్టార్ రజనీకాంత్ తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవడంపై ఆ దేశ రాజకీయ నాయకుడు నమాల్ రాజపక్సే అసంతృప్తి వ్యక్తం చేశారు. 'తమిళ రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడింది. శ్రీలంకలోని తమిళులను ఆదుకునేందుకు రజనీకాంత్ సహా ఎవరినీ వారు ముందుకు రానివ్వరు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే తనయుడైన నమాల్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తమిళ సంఘాల ఆగ్రహం నేపథ్యంలో తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్న విషయాన్ని రజనీ ఒక ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. వీసీకే చీఫ్ తిరుమావలవన్, ఎండీఎంకే చీఫ్ వైగో తదితరులు తనను శ్రీలంక వెళ్లొద్దని కోరారని, వాళ్లతో తనకున్న సంబంధాల దృష్ట్యా వారి కోరికను మన్నిస్తూ పర్యటనను రద్దు చేసుకున్నానని ఆయన తెలిపారు. విడుదతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) తదితర సంఘాల నాయకులు రజనీకాంత్‌ను కలిసి.. శ్రీలంక పర్యటనకు వెళ్లొద్దని కోరారు. వాస్తవానికి తాను తమిళుల నివాస ప్రాంతాలును చూసేందుకే శ్రీలంక వెళ్దామనుకున్నానని, అక్కడ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి మత్స్యకారుల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నట్లు రజనీ తెలిపారు. తాను రాజకీయ నాయకుడిని కానని, కేవలం ఒక నటుడినేనని రజనీ అన్నారు. జ్ఞానం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీలంకలోని జప్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ లబ్ధిదారులకు అందజేసేందుకు ఏప్రిల్ 9న ఆ దేశానికి వెళ్లాలని ఇంతకుముందు రజనీ భావించిన సంగతి తెలిసిందే. -
వారికి కొత్త ఇళ్లు ఇవ్వనున్న రజనీకాంత్
శ్రీలంకలోని జప్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఏప్రిల్ 9న నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో రజనీ 150 కొత్త ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేస్తారని లైకా ప్రొడక్షన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా రజనీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతారని, మొక్కలు నాటుతారని తెలుస్తోంది. జ్ఞానం ఫౌండేషన్ తమిళ నిర్వాసితుల కోసం ఈ ఇళ్లను కట్టించింది. లైకా గ్రూప్ చైర్మన్ సుభాష్ కరన్ అల్లిరాజా తల్లి పేరిట ఏర్పాటుచేసిన జ్ఞానం ఫౌండేషన్ రూ. 22 కోట్ల ఖర్చుతో ఏడాదిన్నర కాలంలో ఈ ఇళ్లను నిర్మించిందని లైకా ప్రొడక్షన్ తన ప్రకటనలో పేర్కొంది. 2009లో అంతర్యుద్ధం అనంతరం శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల పునఃనిర్మాణం కోసం జ్ఞానం ఫౌండేషన్ కృషి చేస్తున్నది. తమిళ నిర్వాసితుల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తున్నది. -
తమిళులను కాపాడిన మత్స్యకారులు
మచిలీపట్నం (కృష్ణా): సముద్రంలో చేపల వేటకు వచ్చి ప్రమాదానికి గురైన తమిళ జాలరులను మచిలీపట్నం మత్స్యకారులు కాపాడారు. వివరాలు.. సముద్రంలో వేటకు వచ్చిన ఐదుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులతో కూడిన పడవ శనివారం వేకువజామున బోల్తా పడింది. దీంతో అక్కడికి సమీపంలోనే ఉన్న బందరుకు చెందిన మత్స్యకారులు గమనించి, అప్రమత్తమయ్యారు. నీటిలో పడిపోయిన నలుగురిని రక్షించి తమ బోటులో చేర్చారు. కాగా, మరొకరు నీటిలో గల్లంతయ్యారు. రక్షించిన వారిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
దైవ దర్శనానికి వస్తే దొంగలను చేస్తారా
* పశువుల కంటే హీనంగా కొట్టారు * కన్నీరు పెట్టుకున్న తమిళులు ప్రొద్దుటూరు క్రైం: జ్యోతి క్షేత్రానికి వస్తే మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చాం.. అయితే ఇక్కడి అటవీశాఖ అధికారులు మమ్మల్ని దొంగల్ని చేశారు.. పశువుల కంటే హీనంగా కొట్టారు .. అంటూ తమిళులు కన్నీరు పెట్టుకున్నారు. వనిపెంట అటవీశాఖ అధికారుల అదుపులో ఉన్న తమిళులు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వస్తే ఎర్రచందనం స్మగ్లర్లమని అదుపులోకి తీసుకుని నాలుగు రోజులపాటు పశువుల కంటే ఘోరంగా కొట్టారని వారు వివరించారు. తామందరం పనులు చేసుకునే వాళ్లమని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆమె ముందు వాపోయారు. తమ వద్ద ఉన్న రూ. 42 వేలతో పాటు సెల్ఫోన్లను కూడా లాక్కున్నారని తెలిపారు. కేవలం తమిళం మాట్లాడుతున్నామనే మమ్మల్ని ఇలా అదుపులోకి తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇళ్లు అడవిలో ఉంది.. ఇంటి వద్ద భార్యా పిల్లలు ఉన్నారు.. వారికి ఏం కావాలన్నా నేనే తీసుకుని వెళ్లాలి.. ఐదారు రోజుల నుంచి అన్నం లేకుండా ఎలా ఉన్నారో అంటూ సెల్వరాజ్ ఆస్పత్రిలో జయశ్రీ ముందు రోదించసాగాడు. అటవీశాఖ అధికారులకు దర్యాప్తు పట్టదా.. ఆస్పత్రిలో తమిళులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్న అనంతరం జయశ్రీ విలేకరులతో మాట్లాడారు. నేరంతో సంబంధం ఉందో లేదో తెలియడానికి దర్యాప్తు చేస్తారన్నారు. అయితే అటవీశాఖ అధికారులు ఎలాంటి విచారణ లేకుండా జ్యోతి క్షేత్రానికి వెళ్లి వస్తున్న తమిళులను అదుపులోకి తీసుకొని ఎర్రచందనం దొంగలుగా చిత్రీకరించడం విచారకరమని ఆమె తెలిపారు. వారిని ఈ నెల 17న అక్రమంగా అరెస్ట్ చేయడమేగాక విచక్షణా రహితంగా చితక్కొట్టారన్నారు. వారి వద్ద కొడవళ్లు దొరికాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరు మంది తమిళులకు రిమాండ్ వనిపెంట రేంజిలో అరెస్టు చేసిన ఆరు మంది తమిళులను సోమవారం అటవీశాఖాధికారులు కోర్టుకు హాజరుపరిచారు. తమిళనాడుకు చెందిన కెప్టెన్ ప్రభాకర్, మోహన్, సెల్వరాజ్, కృష్ణకుమార్, సుబ్రమణి కుమార్‌లు వనిపెంట వైపు వస్తుండగా ఈనెల ఈనెల 17న వనిపెంట అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో వారిలో కెప్టెన్ ప్రభాకర్, మోహన్, సెల్వరాజ్‌లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వీరినికేసు నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారు కోలుకోవడంతో వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. ఈమేరకు పోలీసులు సోమవారం వారిని కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు డీఎఫ్ఓ శివశంకరరెడ్డి తెలిపారు.