సరిగమల తాలింపు మార్గళి మేళవింపు | This is the music month for Chennai | Sakshi
Sakshi News home page

సరిగమల తాలింపు మార్గళి మేళవింపు

Published Thu, Jan 10 2019 1:10 AM | Last Updated on Thu, Jan 10 2019 1:10 AM

This is the music month for Chennai - Sakshi

చెన్నైవాసులకు ఈ ‘మార్గళి’ సంగీత మాసం. ఈ ముప్పై రోజులూ నగరమంతా సంగీతంతో ‘ఘుమఘుమ’లాడుతుంది. సభలన్నీ సంప్రదాయ నృత్యాలతో  ఇంద్రసభను మించిపోతాయి. పట్టుచీరలు, బంగారు నగలు, పరిమళాలు వెదజల్లే కుసుమాలు, నుదుటన రూపాయ బిళ్లంత బొట్లు.. చూడ్డానికి రెండు కళ్లు కాదు కదా, శివుడి మూడు కళ్లు, సాక్షాత్తూ ఇంద్రుడి సహస్రాక్షులు కూడా సరిపోవు అన్నట్లు ఉంటుంది ఈ నాలుగు వారాలూ చెన్నై. 

ధనుర్మాసంలో చెన్నైలో జరిగే ఉత్సవాలే మార్గళి. ఈసారి మార్గళి డిసెంబర్‌ 16న మొదలైంది. జనవరి 14 వరకు జరుగుతుంది. మన పుష్య మాసాన్నే తమిళులు మార్గళి అంటారు. అతిథులకు ఆతిథ్యం ఇచ్చే మాసం ఇది. దేశంలోని కళాకారులందరూ వలస పక్షుల్లా ఇక్కడకు వచ్చి ఏదో ఒక సభలో తమ సంగీత పరిజ్ఞానాన్ని అందరితో పంచుకుంటారు. అందుకే చెన్నైకిది మ్యూజిక్‌ సీజన్‌ కూడా. చెన్నైలోని నారద గాన సభ, కృష్ణ సభ, వాణి మహల్‌ అన్నీ ఈ నాలుగు వారాలూ కిటకిటలాడతాయి. మహిళలు కంచిపట్టు చీరలు, యువతులు కుర్తీ పైజమాలు, వృద్ధులు పంచెలతో భోజనాల దగ్గర సహపంక్తిలో కూర్చొని విందు ఆరగిస్తారు. అరటి ఆకులలో వడ్డించిన అన్నం, ఇలై సాపాడు, సాంబారు అన్నం, పాయసం రకరకాల స్వీట్లు తింటూ కనిపిస్తారు. కొందరు మద్రాసు ఫిల్టర్‌ కాఫీ ఘుమఘుమలను ఆఘ్రాణిస్తారు.

చెన్నై నగరంలో మొత్తం యాభై ప్రదేశాలలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు వచ్చేందుకు పదకొండు నెలల పాటు డబ్బులు దాచుకుంటామని చెబుతారు ఇక్కడకు వచ్చే సంగీతాభిమానులు. ‘‘హోటల్స్‌కి వెళ్లి భోజనం చేస్తే, పొట్ట బరువుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడి ఆహారం మాత్రం చాలా తేలికగా ఉంటుంది’’ అంటారు వాళ్లు నవ్వుతూ. అందుకే, ఒకప్పుడు తన క్యాంటీన్‌లో కేవలం కాఫీ, బజ్జీలు మాత్రమే అమ్మే బాలాజీ పట్టప్ప.. కాలగమనంలో తన మెనూ మార్చుకోవలసి వచ్చింది. ‘పట్టప్ప’ క్యాంటీన్‌ యజమాని బాలాజీ పట్టప్ప. అతి ప్రాచీనమైన మద్రాసు మ్యూజిక్‌ అకాడెమీలో ఈ క్యాంటీన్‌ తన సేవలను అందిస్తోంది.

కొత్తగా కీర వడ, కుళుంబు, కూటులతో పాటు పుచ్చకాయ రసం (సాంబారు), వెజిటబుల్‌ పాయసం కూడా చేర్చారు. ఈ కొత్త రుచులకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. అయితే రానురాను ఈ సభలలో సంగీతం కంటే రుచులకే ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోందని కొంతమంది సంగీత ప్రియులు వాపోతున్నారు. ఒక దశాబ్ది కాలంగా ఈ మార్గళి ఉత్సవాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న సినీ నేపథ్య గాయకుడు ఉన్నికృష్ణన్‌ కూడా ఈ విషయంలో కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. ‘‘ఆహారం మీద ధ్యాస ఉంటే, సంగీత కచేరీలను శ్రద్ధగా వినలేకపోతారు’’ అంటారు ఆయన. అయితే, ‘‘ఈ కచేరీలకు వస్తే, వండుకోవడానికి కుదరదు. కచేరీకి కచేరీకి మధ్యలో ఏదో కొద్దిగా తినడానికి ఏమైనా ఉండడం మంచిదే కదా’’ అంటున్నారు ఉమా శ్రీనివాసన్‌ (పట్టప్ప కుమార్తె).

ముందు కనువిందు..!
ట్రిప్లికేన్‌లోని పార్థసారథి స్వామి సభ నిత్యం సంగీత ఆస్వాదకులతో నిండిపోతుంది. ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ ఈ సభలకు హాజరవుతుంటారు. వీరు కూడా అక్కడకు రాగానే మొదట మెనూలో ఏముందో చదువుతారు. బొప్పాయి వేపుడు, చిలగడదుంపల వడ, బాదం బొబ్బట్లు, పల్లీ పుడ్డింగ్‌ వంటి వాటిని అక్కడ అందరికీ సుపరిచితులైన మౌంట్‌బాటెన్‌ మణి అయ్యర్‌ తయారు చేయిస్తుంటారు. అయ్యర్‌ 1960 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ మద్రాసు వచ్చారు. గిండీ నుంచి పాలన చేసేవారు. ఆ సమయంలో మా నాన్నగారి వయసు 17. ఆయన వారికి స్వచ్ఛమైన దక్షిణ భారత భోజనం అందించేవారు. అందులో బాదం హల్వా, బంగాళదుంపల వేపుడు, సాంబారు అన్నం, పాల పాయసం ఉండేవి.

నాన్నగారు తయారుచేసిన రుచికరమైన ఆహారానికి సంబర పడిన మౌంట్‌ బాటెన్‌ పేరుమీదుగా మా నాన్నగారు తన వ్యాపారం ఆ పేరుతోనే ప్రారంభించారు.మౌంట్‌ బాటెన్‌ మణి అయ్యర్‌ క్యాంటీన్‌ రుచుల గురించి అందరికీ తెలియడంతో, అందుకు భిన్నంగా పట్టప్ప పురాతన సంప్రదాయ వంటలైన క్షీరాన్నం, అక్కడర వడిసల్‌ (పాలు, పంచదారలతో చేసేది), బూడిద గుమ్మడి కాయ రైతా, రసవాంగీ (వంకాయ గ్రేవీ), మూర్‌ కూటు (మజ్జిగ గ్రేవీ), సెన్నై సోదీ (కంద కూర) వంటకాలను తయారుచేయడం ప్రారంభించారు. ఈ వంటకాలకు మంచి ఆదరణ వచ్చింది. ఈ వంటకాలను వేరే చోట తినగలం, కాని క్షీరాన్నం మాత్రం ఇంకెక్కడా దొరకదు’ అంటారు అక్కడ భోజనం చేసినవారంతా.

మార్గళి క్యాంటీన్‌లలో పదిహేను రోజులు ముందుగానే మెనూ సిద్ధం చేస్తారు. ప్రసిద్ధులైనవారి కచేరీలు ఉంటే, ఆరోజు మెనూ కూడా చాలా ప్రసిద్ధంగా, ఎక్కువ వంటకాలతో రూపొందిస్తారు. యువతకు ఆకర్షణీయంగా, వృద్ధులకు తేలికగా అరిగే వంటకాలతో ఉంటుంది మెనూ.ఒకప్పుడు సభకు వచ్చేవారి టికెట్‌ చూసి మాత్రమే భోజనాలకు అనుమతించేవారు. కానీ ఇప్పుడు కచేరీలకు రాకపోయినా, క్యాంటీన్‌కి వచ్చి భోజనం చేయవచ్చు. ‘‘వండిన వంట కంటే తక్కువ మంది వచ్చినా, ఎక్కువ మంది వచ్చినా ఏమీ చేయలేమని, ఉదయం 7.30 నుంచి వంట ప్రారంభమవుతుందని’’ చెబుతారు పట్టప్ప. మలేసియాలో నివసించే ఉమా బాలన్‌ అనే సంగీతాభిమాని ప్రతి సంవత్సరం ఈ కచేరీల కోసం మద్రాసు వస్తారు. భోజనాల దగ్గర వారు ప్రేమగా నెయ్యి వడ్డించడం దగ్గర నుంచి అన్నీ ఆవిడ మనసుని హత్తుకున్నాయట. సంగీత సాహిత్య సమలంకృతే అనడానికి బదులు సంగీత ఆహార సమలంకృతే అనాలేమో ఈ మార్గళి మాసాన్ని.
– జయంతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement