వారికి కొత్త ఇళ్లు ఇవ్వనున్న రజనీకాంత్
శ్రీలంకలోని జప్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఏప్రిల్ 9న నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో రజనీ 150 కొత్త ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేస్తారని లైకా ప్రొడక్షన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా రజనీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతారని, మొక్కలు నాటుతారని తెలుస్తోంది. జ్ఞానం ఫౌండేషన్ తమిళ నిర్వాసితుల కోసం ఈ ఇళ్లను కట్టించింది.
లైకా గ్రూప్ చైర్మన్ సుభాష్ కరన్ అల్లిరాజా తల్లి పేరిట ఏర్పాటుచేసిన జ్ఞానం ఫౌండేషన్ రూ. 22 కోట్ల ఖర్చుతో ఏడాదిన్నర కాలంలో ఈ ఇళ్లను నిర్మించిందని లైకా ప్రొడక్షన్ తన ప్రకటనలో పేర్కొంది. 2009లో అంతర్యుద్ధం అనంతరం శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల పునఃనిర్మాణం కోసం జ్ఞానం ఫౌండేషన్ కృషి చేస్తున్నది. తమిళ నిర్వాసితుల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తున్నది.