Tandoor murder case
-
తందూర్ హత్య కేసు; ఇంకా జైలులోనే ఉంచితే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ : భార్యను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో దాదాపు 20 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న సుశీల్ శర్మ అనే వ్యక్తిని వెంటనే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుశీల్ చేసిన అభ్యర్థనను ఎందుకు నిరాకరించారో చెప్పాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో ‘ ఒక నేరంలో శిక్ష అనుభవించిన వ్యక్తిని ఇంకా జైలులోనే ఎలా ఉంచుతారు. ముందస్తుగా విడుదల చేయాలన్న అతడి అభ్యర్థనను శిక్షాకాల పునఃసమీక్ష బోర్డు(సెంటెన్స్ రివ్యూ బోర్డు- ఎస్సార్బీ) తోసిపుచ్చిన తీరు ఏకపక్షంగా ఉంది’ అని సిద్ధార్థ్ మృదుల్, సంగీత ధింగ్రా సెహగల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే శిక్ష అనుభవించిన సుశీల్ శర్మను తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం ఆదేశించింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న సుశీల్ శర్మ(తందూర్ హత్యకేసు), మను శర్మ(జెస్సికా లాల్ హత్యకేసు), సంతోష్ సింగ్(ప్రియదర్శిని మట్టూ అనే యువతి హత్యకేసు)లు తమను ముందస్తుగా విడుదల చేయాలంటూ చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరులో ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన సమావేశమైన శిక్షాకాల పునఃసమీక్ష బోర్డు... అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన ఇలాంటి వ్యక్తులను ముందస్తుగా విడుదల చేయడం అంత శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అతడిని విడుదల చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. తందూర్ హత్యకేసు... ఢిల్లీకి చెందిన సుశీల్ శర్మ 1995లో తన భార్య నైనా షాహ్నిని హత్య చేశాడు. మొదట ఆమెపై రెండుసార్లు కాల్పులు జరిపిన సుశీల్... ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తందూర్(బాండీ)లో వేసి ఉడికించాడు. ఈ క్రమంలో తందూర్ హత్య కేసుగా నైనా హత్యకేసు ప్రాచుర్యం పొందింది. కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే సుశీల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని.. ఈ కేసును విచారించిన పోలీసు అధికారి మాక్స్వెల్ పెరీరా తన పుస్తకంలో పేర్కొన్నారు. నైనాను హత్య చేసిన తర్వాత మొదట ఆమె శవాన్ని యమునా నదిలో పడేయాలని సుశీల్ భావించాడని... అయితే తన ఆలోచన విరమించుకుని స్నేహితుడు నడిపే రెస్టారెంట్లో ఉన్న తందూర్‌లో వేసి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. -
'ఉరి' తప్పింది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూరీ హత్యకేసులో నిందితుడు, ఢిల్లీ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ శర్మకు 'ఉరి' తప్పింది. అతనికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. 1995 జులై 2న తందూరీ రెస్టారెంట్లో తన భార్య నైనా సాహ్నిని తోసివేసి నిప్పు అంటించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే నైనా సాహ్నిపై ఏర్పడ్డ అనుమానం వల్లే ఈ హత్య జరిగిందని భావించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ... సుశీల్ శర్మ మరణ శిక్షను జీవితఖైదుగా మార్పు చేస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసుల ఛార్జీషీటు ప్రకారం.. కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్న తన భార్య నైనా సాహ్ని మరో కాంగ్రెస్ నేత మత్లూబ్ కరీంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకున్నాడు. అంతేకాకుండా మత్లూబ్ కరీం.. నైనా ఇద్దరూ కలిసి చదువుకున్న నేపథ్యంలో ....వారు రహస్యంగా వివాహం చేసుకుంటారని భావించిన శర్మ నైనాపై ద్వేషం పెంచుకున్నాడు. జులై 2న ఇంటికి వచ్చిన శర్మ తన భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా చూశాడు. ఆ తర్వాత ఫోన్ రీడయల్ చేసిన శర్మకు ఆ నెంబరు మత్లూబ్ కరీందిగా తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన శర్మ తన భార్య నైనా సాహ్నిపై తన దగ్గర ఉన్న సైలెంట్ రివాల్వర్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో నైనా అక్కడికక్కడే మృతి చెందింది. నైనా మృతదేహాన్ని శర్మ, తన స్నేహితుడు, భాగియా రెస్టారెంట్ మేనేజర్ కేశవ్‌తో కలిసి తందూరి పొయ్యిలో పెట్టి కాల్చివేశారు. అనంతరం హత్యను ప్రమాదవశాత్తూ జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్న సుశీల్ శర్మ జులై 11, 1995లో పోలీసులకు లొంగిపోయాడు. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టు కూడా మరణశిక్షను ధ్రువీకరించి క్షమాభిక్షను నిరాకరించింది. దాంతో సుశీల్ శర్మ తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని అతను సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే. -
తందూరీ కేసులో సుశీల్ శర్మకు జీవిత ఖైదు
నైనా సాహ్ని హత్య కేసులో సుశీల్ శర్మకు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారస్తూ సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన భార్య నైనా సాహ్ని హత్య కేసులో తనకు మరణశిక్ష విధించడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ కేసు ఈ ఏడాది ఆగస్టు13న సుప్రీం విచారించింది. అనంతరం ఆ కేసును ఆక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన నేత సుశీల్ శర్మ. ఆయన భార్య నైనా సాహ్ని. 1995లో నైనా సాహ్నిని హత్య చేశాడు. అనంతరం ఆమెను తన నివాసంలో తందూరీ చికెన్ తరహాలో కాల్చాడు. దాంతో సుశీల్ శర్మపై కేసు నమోదు అయింది. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దాంతో ఆయన తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని ఆయన సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే.