పెరుగుతున్న చలి
తాండూరు: కొద్ది రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇటీవల తుపాను నేపథ్యంలో మరింత ఎక్కువైంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో ‘చలిపులి’ విజృంభిస్తోంది. దీంతో జనాలు వణికిపోతున్నారు. ఉదయం వేళలో చలిగాలులతోపాటు మంచు ప్రభావం కూడా కనిపిస్తోంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు తటస్థంగా ఉన్నప్పటికీ ఐదురోజులుగా రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 16.5 డిగ్రీలు నమోదైంది. ఈ నెల 24వ తేదీన గరిష్టం 32.5, కనిష్టం 17.9, 25న 25.3- 21.8, 26న 22.5-19, 27న 25.2-19.2, మంగళవారం గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 16.5 డిగ్రీలు నమోదయ్యా యని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ పేర్కొన్నారు. ఐదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం వల్లే చలి పెరిగిందని తెలిపారు.